Plague : రష్యా (Russia) లో ప్లేగు (Plague) వ్యాధి వ్యాప్తిపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ వ్యాధితో తాజాగా మరో మరణం సంభవించిందంటూ ఆ దేశ మీడియాలో తాజాగా కథనాలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన క్రెమ్లిన్ (Kremlin) ఆ వార్తలను కొట్టిపారేసింది. అదంతా తప్పుడు ప్రచారమేనని స్పష్టంచేసింది. అంటువ్యాధి ప్రబలే ప్రమాదం లేదని తేల్చి చెప్పింది.
సైబీరియాలోని యాంటీ ప్లేగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే షిపిలోవా అనే మహిళ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె మరణానికి ల్యాబ్ నుంచి లీకైన ప్లేగు బ్యాక్టీరియానే కారణమని వార్తలు వచ్చాయి. దాంతో ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇదే సమయంలో రష్యాలో మరో వ్యక్తి కూడా ఈ వ్యాధి కారణంగా మరణించారంటూ కథనాలు రావడం ఆందోళనకు గురిచేసింది.
ఈ నేపథ్యంలో క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఈ వార్తలపై స్పందించారు. అదంతా అసత్య ప్రచారమేనని కొట్టిపారేశారు. ఆరోగ్య విభాగం నుంచి అధికారికంగా వచ్చిన సమాచారాన్నే విశ్వసించాలని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు.