వాషింగ్టన్: ఫైజర్ కంపెనీకి చెందిన నకిలీ టీకాలను మెక్సికో, పోలాండ్ దేశాల్లో సీజ్ చేశారు. ఒక్కో డోసును వెయ్యి డాలర్లకు ఇస్తున్నట్లు అమెరికా మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఫైజర్ సంస్థ కూడా ఆ కథనాన్ని ద్రువీకరించింది. మెక్సికోలోని ఓ క్లీనిక్‌లో 80 మంది బోగస్ టీకాలను తీసుకున్నారు. అయితే ఆ టీకాల వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. కానీ అవి వైరస్ పట్ల మాత్రం రక్షణ ఇవ్వవు. బీర్ కూలర్లలో టీకా బాటిళ్లను గుర్తించినట్లు మెక్సికో అధికారులు చెప్పారు. పోలిండ్లో కూడా నకిలీ ఫైజర్ టీకాలను జప్తు చేశారు. ఆ టీకాల్లో కాస్మటిక్ పదార్ధం ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుత మార్కెట్‌ను గమనిస్తే, నకిలీ టీకాల జోరు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోందని ఫైజర్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మెక్సికోలో నకిలీ ఫైజర్ టీకాల లభ్యమైనట్లు మార్చిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఆ బోగస్ టీకాలను పరీక్షించిన ఫైజర్.. వాటిల్లో బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మందు లేనట్లు పేర్కొన్నది. డిమాండ్ ఎక్కువగా ఉండడం.. వ్యాక్సిన్ల కొరత ఉండడం వల్ల బోగస్ టీకాలు వస్తున్నట్లు ఫైజర్ అధికారి లెవ్ కుబియాక్ తెలిపారు. హోండరస్‌కు వెళ్తున్న ఓ విమానం నుంచి సుమారు ఆరు వేల డోసులు స్పుత్నిక్ టీకాలను సీజ్ చేశారు. ఆ టీకాలు నిజమైనవా కావా అన్న కోణంలో మెక్సికో అధికారులు విచారణ చేపడుతున్నారు.