మాస్కో, ఏప్రిల్ 12: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir putin) ఆరోగ్యంపై మరోసారి పలు వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఉక్రెయిన్పై సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై పలు వదంతులు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారని ఆరోగ్య నివేదికలను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కోడై కూస్తున్నాయి. కంటిచూపు మందగించడం, నాలుక తిమ్మిరి వంటి లక్షణాలతో పుతిన్ బాధపడుతున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయని తమ కథనాల్లో పేర్కొన్నాయి. ప్రస్తుతం పుతిన్ కుడిచేయి, కాలు స్పర్శ కోల్పోవడంతో ఆయనకు వైద్యులు ఆత్యవసర చికిత్స అందిస్తున్నట్టు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించగా, అందుకు పుతిన్ నిరాకరించినట్టు సమాచారం.