US vs Iran : పశ్చిమాసియా (West Asia) లో యుద్ధ సంక్షోభం ఇప్పుడప్పుడే ముగిసేలా కనబడటం లేదు. ఇరాన్ (Iran) తో కాల్పుల విరమణ పొడిగింపు, హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో దిగ్బంధనం ఎత్తివేతకు సంబంధించిన తాత్కాలిక ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకం చేయలేదు. దాంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యింది. ఇరాన్ (Iran) తో తాత్కాలిక ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకునేందుకు శ్వేతసౌధం సిచ్యువేషన్ రూమ్‌లో ట్రంప్ తన సలహాదారులతో సమావేశమయ్యారు.
దాదాపు రెండు గంటలపాటు వారు సమావేశమయ్యారు. అయినప్పటికీ ఒప్పందంపై ఎలాంటి పురోగతి లేదు. ఈ డీల్‌పై సంతకం చేయకుండానే ట్రంప్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామాలపై వైట్‌హౌస్ అధికారి మాట్లాడుతూ.. ఇరాన్‌తో కుదిరే ఏ ఒప్పందమైనా అది అమెరికా (USA) కు మేలు చేసేదిగా ఉండాలని, టెహ్రాన్‌పై విధించే ఆంక్షలు, నిబంధనలపై ట్రంప్ సంతృప్తి చెందాలని అన్నారు. ఆ తర్వాతే అధ్యక్షుడు డీల్‌పై సంతకం చేస్తారని ఈ సందర్భంగా ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని పేర్కొన్నారు. మరోవైపు డీల్ విషయంపై అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. ఇంకా తుది ఒప్పందం ఖరారు కాలేదన్నారు.
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఇరాన్‌తో యుద్ధం తిరిగి ప్రారంభించే సత్తా అగ్రరాజ్యానికి ఉందన్నారు. తమ ఆయుధ నిల్వలు నిండుగా ఉన్నాయన్నారు. ఇక అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా కీలక పోస్టు పెట్టింది. పశ్చిమాసియాలో తమ దళాలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపింది. దాంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది.