వాషింగ్టన్, ఏప్రిల్ 14: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మిత్ర దేశాల నుంచి నిరాకరణ కొనసాగుతున్నది. ఇరాన్ పోర్టులను బ్లాక్ చేయాలన్న ఆయన పిలుపునకు పలు నాటో దేశాలు మద్దతు ఇవ్వలేదు. అది తమ పని కాదని పేర్కొన్నాయి. ఈ ఘర్షణలో పాల్గొనడం ద్వారా ఇందులోకి తమను బలవంతంగా ఈడ్చవద్దని, అది తమకు ఇష్టం లేదని, ఇందులో తాము భాగస్వామి కాదల్చుకోలేదని బ్రిటన్, ఫ్రాన్స్ సహా పలు దేశాలు స్పష్టం చేశాయి.
అయితే హొర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపాయి. సాధారణంగా ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ఈ జలసంధి గుండానే జరుగుతున్నది. ఇది తెరిపించడానికి సైనిక చర్యకు సహకరించాలని ఇప్పటికే ట్రంప్ పిలుపునివ్వగా, దానికి నాటో దేశాలు తిరస్కరించాయి. దీంతో ఇప్పటికే నాటో దేశాల వైఖరిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాటో నుంచి వైదొలగుతానని బెదిరించారు.