Russia vs Ukraine : రష్యా (Russia) పై ఉక్రెయిన్ వందల డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల కారణంగా మాస్కోలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలు మూతపడ్డాయి. దాంతో విమానాల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. మాస్కో, దాని పరిసర ప్రాంతాలే లక్ష్యంగా ఉక్రెయిన్ (Ukraine) వందల డ్రోన్లతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో విమానాల రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. రాజధాని అంతటా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. మాస్కో ఆయిల్ రిఫైనరీకి సమీపంలోనూ ఈ దాడులు జరగడంతో అక్కడ పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా పొగ కూడా వ్యాపించింది.
దాంతో ఇక్కడి రోడ్లపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. జోకోవ్స్కీ జిల్లాలోని ఓ అపార్ట్మెంట్ భవనంపై, మాస్కో శివార్లలోని ఓ షాపింగ్ మాల్ వద్ద డ్రోన్ దాడులు జరిగాయి. అయితే ఈ దాడుల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా లేదా అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. దాడులు జరుగుతున్న సమయంలో మాస్కోలోని అత్యంత రద్దీగా ఉండే షెరెమెట్యేవో విమానాశ్రయంలోని ప్రయాణికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతోపాటు విమాన కార్యకలాపాలను కూడా పరిమితం చేశారు.
ఉక్రెయిన్ నుంచి తమ దేశంపైకి దూసుకొచ్చిన 500కు పైగా డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు తిప్పికొట్టాయని రష్యా రక్షణశాఖ తెలిపింది. ఇందులో మాస్కో వైపు దూసుకొచ్చిన 180కి పైగా డ్రోన్లను అడ్డుకున్నట్లు వెల్లడించింది. గత రెండేళ్లలో మాస్కోపై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని ఆ దేశ మీడియా తెలిపింది. కజాన్ నగరంలో ఆసియన్ నేషనల్ సమ్మిట్ జరగడానికి కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం గమనార్హం. ఈ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోపాటు ఆసియన్ దేశాల నాయకులు పాల్గొననున్నారు. ఇక ఈ దాడికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎక్స్‌లో పోస్టు చేశారు.