పసివాళ్లు ఇంట్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అపార్ట్మెంట్లలో ఉండే వారైతే మరిన్ని జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే పిల్లలకు తెలియక బాల్కనీలోకి వచ్చేస్తే.. ఒక్కోసారి పొరపాటున కింద పడిపోతుంటారు. అదిగో అలాంటి ఘటనే చైనాలోని టాంగ్షింగ్లో వెలుగు చూసింది.
అయితే అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న షెన్ డాంగ్ అనే వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ.. రోడ్డు పక్కనే ఉన్న బిల్డింగ్‌లోని ఐదో అంతస్తు కిటికీలో నుంచి ఒక రెండేళ్ల పాప పడిపోవడం చూశాడు. అంతే పరిగెత్తుకుంటూ వచ్చి చేతిలోని మొబైల్ కింద పడేసి.. ఆ పాపను క్యాచ్ పట్టేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
చైనా విదేశాంగ అధికార ప్రతినిధి లియాజ్ ఝావో దీన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. ‘‘మన మధ్యలో ఉన్న హీరోలు’’ అంటూ ఈ వీడియోను షేర్ చేశారాయన. షెన్ డాంగ్తోపాటు మరో మహిళ కూడా సహాయం చేసేందుకు వచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్లు వాళ్లిద్దరినీ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Heroes among us. pic.twitter.com/PumEDocVvC
— Lijian Zhao 赵立坚 (@zlj517) July 22, 2022