Pakistan | ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న దాయాదిదేశం పాకిస్థాన్‌లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. నిన్నటికి నిన్న విద్యుత్ సంక్షోభం కలవరపెడితే.. ఇప్పుడు పెట్రోల్ సంక్షోభం తెరపైకి వచ్చింది. పాకిస్థాన్‌లోని పలు ప్రావిన్సులను పెట్రోల్ కొరత వేధిస్తోంది. పలుచోట్ల పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఇంధనం కోసం ప్రజలు గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సరఫరా తగ్గిన కారణంగా ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్‌తోపాటు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో పెట్రోల్ కొరత ఏర్పడింది. దిగుమతుల కోసం ప్రైవేట్ బ్యాంకులు క్రెడిట్ లెటర్స్ జారీ చేయడంలో నెలకొన్ని జాప్యం కారణంగా ఆయిల్ కంపెనీలు ప్రావిన్స్‌కు పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాను తగ్గించాయి. దీంతో అనేక ఫిల్లింగ్ స్టేషన్లు మూతపడ్డాయి.