బీజింగ్: టర్మినేటర్ 2 సైన్స్ ఫిక్షన్ సినిమాలోని టీ-1000 రోబో సెక్యూరిటీ గేట్ ఇనుప కడ్డీల నుంచి సులభంగా దూరిపోయి.. తప్పించుకొనే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అచ్చం అలాంటి ఓ బుల్లి రోబోను పరిశోధకులు ఆవిష్కరించారు. ఇది ఒక్క ఆదేశంతో ద్రవస్థితిలోకి మారిపోయి మళ్లీ తనకు తాను పునర్నిర్మించుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. మూసి ఉన్న ప్రదేశాల నుంచి కూడా ఈ రోబో తప్పించుకోగలదు. ఇది వైద్యం సహా అనేక రంగాల్లో సమస్యలను పరిష్కరించే గొప్ప ఆవిష్కరణ అవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఎలా తయారు చేశారు?
మాగ్నెటిక్ నియోడైమియం, బోరాన్, ఇను ము సూక్ష్మభాగాలను తక్కువ ద్రవీభవనస్థానం కలిగిన ద్రవ గాలియంలో అమర్చారు. మాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా రోబోను వేడి చేసినప్పుడు గాలియం కరిగిపోతుంది. వెంటనే రోబో ద్రవస్థితిలోకి మారిపోతుంది. అనంతరం మళ్లీ తనకుతాను పునర్మిర్మించుకొని రోబోలా మారిపోతుంది. ఇందులోని అయస్కాంత కణాలు రోబో ముందుకు కదిలేందుకు, అయస్కాంత క్షేత్రానికి అనుగుణంగా ప్రతిస్పందించే సామర్థ్యాన్ని అందిస్తాయి. ఈ రోబోను పరిశోధకులు ‘సీ కుకుంబర్’ అనే జీవి స్ఫూర్తితో తయారుచేశారు.