Landslides : హిమానీనదం (Glacier) విరిగిపడి భారీ వరదల (Floods) తో అతలాకుతలమైన నేపాల్ (Nepal) ను మరో ముప్పు వెంటాడుతోంది. తాజాగా జారీచేసిన వరద ప్రమాద హెచ్చరికలు ఆ దేశాన్ని తీవ్రంగా భయపెడుతున్నాయి. భారీ వర్షాల (Heavy Rains) నేపథ్యంలో దార్చులా జిల్లాలోని భట్టార్ ప్రాంతంలో కొండచరియలు (Landslides) విరిగిపడి చౌలానీ నది ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. కొండలపై నుంచి జారిపడిన రాళ్లు, మట్టితో నదీ ప్రవాహం పాక్షికంగా నిలిచిపోయింది.
దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాళ్లు తొలగిపోతే ఒక్కసారిగా దిగువ ప్రాంతాలను వరద ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ క్రమంలోనే నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం సూచించింది. పరిస్థితిని పర్యవేక్షించేందుకు పోలీసులను రంగంలోకి దించింది. సహాయక చర్యల కోసం అత్యవసర ఫోన్ నంబర్లనూ విడుదల చేసింది. వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలు ఇంకా కోలుకోకముందే ఈ కొత్త ముప్పు పొంచి ఉండటం ఆందోళనకరంగా మారింది.