టెహ్రాన్ : అమెరికా, ఇజ్రాయెల్ ఒక్కటై ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధం తగ్గుముఖం పట్టే సూచనలు కనపించటం లేదు. ఈ యుద్ధంలో ఇరాన్ గణనీయంగా దెబ్బతిన్నప్పటికీ.. ఆ దేశం వద్ద ఒక రహస్య అస్త్రం ‘డర్టీ బాంబ్’ ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇరాన్ వద్ద 60 శాతం వరకు శుద్ధి చేసిన యురేనియం నిల్వలు 460 కిలోలు ఉన్నాయి. అణుబాంబు తయారీకి 90 శాతం శుద్ధి చేసిన యురేనియం కావాలి. అయితే ఈ 60 శాతం యురేనియంతో ఇరాన్ ‘డర్టీ బాంబ్’ను ప్రయోగించే అవకాశం ఉందని ‘యూఎస్ న్యూక్లియర్ రెగ్యులేటరీ కమిషన్’ భావిస్తున్నది. ఒకవేళ దీనిని ఇరాన్ ప్రయోగిస్తే.. అమెరికా, ఇజ్రాయెల్ మరింత భీకరదాడులకు దిగుతాయని, యుద్ధ స్వరూపం మారిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మామూలు పేలుడు పదార్థాలతోపాటు అణుధార్మిక పదార్థాల్ని కూడా కలిపితే.. దానిని ‘డర్టీ బాంబ్’గా వ్యవహరిస్తారు. డైనమైట్ వంటి సాధారణ పేలుడు పదార్థాలను రేడియోధార్మిక పదార్థాలతో కలిపి తయారు చేస్తే అప్పడు అది ‘డర్టీ బాంబ్’గా మారుతుంది. ఇది అణుబాంబులా భారీ పేలుడు సృష్టించదు కానీ, పేలుడు జరిగిన ప్రాంతంలో రేడియేషన్ వ్యాప్తి చెందుతుంది. దీనిని పెద్ద నగరంపై ప్రయోగిస్తే కోట్లాది మందిలో భయాందోళనలు తలెత్తుతాయి. అక్కడి ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోతాయి. పౌరులను వేరే చోటకు తరలించాల్సి వస్తుంది.