మాస్కో: ఇరాన్ వద్ద శుద్దీకరించిన యురేనియం నిల్వలు(uranium stockpile) ఉన్న విషయం తెలిసిందే. భారీ మొత్తంలో ఇరాన్ వద్ద స్టాక్స్ ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. ఆ అణు నిల్వల కోసం అమెరికా దాడికి కూడా ప్లాన్ చేసింది. అయితే తమ వద్ద ఉన్న అణ్వాయుధ నిల్వలను రష్యాకు అప్పగించాలని ఇరాన్ భావిస్తున్నట్లు సౌదీ అరేబియాకు చెందిన మీడియా సంస్థ అల్ హదత్ తన కథనంలో పేర్కొన్నది. పాకిస్థాన్ ద్వారా శాంతి ప్రతిపాదన చేసిన ఇరాన్ తన అణు నిల్వల అంశాన్ని అమెరికాకు వెల్లడించినట్లు తెలుస్తోంది. రష్యాకు అప్పగించే యురేనియం నిల్వల గురించి తమ వద్ద లీకైన డాక్యుమెంట్ ఉన్నట్లు అల్ హదత్ పేర్కొన్నది.
ఇరాన్ తన అణ్వాయుధ ప్రోగ్రామ్ను ఫ్రీజ్ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ఆ కథనంలో తెలిపారు. కానీ దానికి ఒక షరతు పెట్టినట్లు తెలుస్తోంది. తమ వద్ద ఉన్న శుద్దీకరించిన యురేనియంను అమెరికాకు కాకుండా రష్యాకు అందించేందుకు ఇరాన్ ఆసక్తిగా ఉందని, ఈ షరతుపై ఇరాన్ పట్టిపట్టినట్లు తెలుస్తోంది. ఇక అణ్వాయుధ కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేసుకునే ఆలోచన తాము లేమని ఇరాన్ చెప్పినట్లు సమాచారం ఉంది.
ఇరాన్ వద్ద సుమారు 400 కేజీల శుద్దీకరించిన యురేనియం ఉంది. ఆ యురేనియం సుమారు 60 శాతం శుద్ది జరిగింది. అయితే ఆయుధాలు తయారు చేసేందుకు 90 శాతం శుద్దీకరణ కావాల్సి ఉంటుందని అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొన్నది. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం తాము తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు గతంలో అనేకసార్లు రష్యా వెల్లడించింది. ఇరాన్ తన యురేనియంను తమకు అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.