టెహ్రాన్: అమెరికాపై ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ) తన మాటల దాడిని ఉధృతం చేసింది. ఇరాన్‌ను ఎదుర్కోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు చాలా పరిమితమైన, క్లిష్టమైన దారులు ఉన్నాయని ఐఆర్జీసీ హెచ్చరించింది. సాధ్యంకాని ఆపరేషనా లేక ఇరాన్‌తో ఒక చెడ్డ ఒప్పందమా అన్న దాంట్లో ఒకదాన్ని ట్రంప్ ఎంచుకోవాలని ఐఆర్జీసీ నిఘా విభాగం ఒక ప్రకటనలో పేర్కొన్నట్లు ఇరానియన్ ప్రభుత్వ టీవీ తెలిపింది. ఈ హెచ్చరిక రెండు దేశాల మధ్య, ముఖ్యంగా ఆ ప్రాంతంలో అమెరికా సైనిక ఒత్తిడి విషయంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తున్నది. ఐఆర్జీసీ ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్టులో ఇవే వ్యాఖ్యలు మరోసారి వెలువడ్డాయి.
దీన్ని అర్థం చేసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది: ట్రంప్ ఒక అసాధ్యమైన సైనిక చర్య లేదా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో ఒక చెడ్డ ఒప్పందం మధ్య ఎంచుకోవాలి. అమెరికాకు నిర్ణయం తీసుకునే అవకాశాలు తగ్గిపోయాయి అని పేర్కొన్నది. అంతేగాక, ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన నావికా దిగ్బంధాన్ని ముగించడానికి ఇరాన్ ఒక గడువు విధించిందని తెలిపింది. అయితే అందుకు కచ్చితమైన కాలపరిమితిని ఐఆర్జీసీ పేర్కొనలేదు. అమెరికా పట్ల చైనా, రష్యా, యూరప్ వైఖరిలో మార్పు వస్తున్నదని, ఇది పెరుగుతున్న అంతర్జాతీయ ఒత్తిడిని సూచిస్తున్నదని కూడా ఐఆర్జీసీ తెలిపింది.
యుద్ధాన్ని ముగించేందుకు 14 పాయింట్లతో ఇరాన్ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. పాకిస్థాన్ ద్వారా దీన్ని అమెరికాకు అందజేసింది. లెబనాన్‌సహా అన్ని విధాలుగా యుద్ధాన్ని ముగించాలని కోరింది. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ పొడిగింపును తిరస్కరించింది. 30 రోజుల్లోగా యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేలా పరిష్కారాన్ని కోరింది. తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, తమపై మళ్లీ దాడి చేయకుండా భద్రతా హామీలు ఇవ్వాలని, హొర్ముజ్ దిగ్బంధాన్ని ఎత్తివేయాలని, స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని, యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఆ ప్రతిపాదనల్లో కోరింది.
ఇరాన్ దురుసుగా ప్రవర్తిస్తే సైనిక దాడులను తాము పునఃప్రారంభించవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం హెచ్చరించారు. ఇరాన్ 14 అంశాల శాంతి ప్రతిపాదన సమీక్ష సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాయకత్వంపై అనిశ్చిత స్థితి ఉన్నప్పటికీ ఆ దేశంతో చర్చలు పురోగమిస్తున్నాయని ట్రంప్ అన్నారు. దక్షిణ ఫ్లోరిడాలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఇరాన్ దురుసుగా ప్రవర్తిస్తే, ఏదైనా చెడు చేస్తే మళ్లీ యుద్ధం ప్రారంభించడానికి తాము సిద్ధమని ఆయన చెప్పారు.
ఇరాన్లో మిగిలిన క్షిపణి ఉత్పత్తి సామర్థ్యాలను కూడా నిర్మూలించాలని అమెరికా ఇప్పటికీ కోరుకుంటున్నదని ఆయన అన్నారు. మళ్లీ వారు(ఇరాన్) ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు. కానీ వారు పూర్తిగా నాశనమయ్యారు. తమ నాయకుడు ఎవరో వారు తేల్చుకోలేకపోతున్నారు. తమ నాయకుడు ఎవరో వారికి తెలియదు. ఎందుకంటే వారి నాయకుడు ఇప్పుడు లేడు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. గడచిన 47 ఏండ్లలో తన గత చర్యలకు ఇరాన్ ఇంకా తగినంత భారీ మూల్యం చెల్లించాల్సి ఉందని ట్రంప్ చెప్పారు.