Citigroup Layoffs | అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్ (Citi group) కంపెనీలోని వందలాది మంది ఉద్యోగులను తొలగించడానికి (Layoffs) రంగం సిద్ధంచేసింది. సంస్థలోని ఆపరేషన్స్, టెక్నాలజీ ఆర్గనైజేషన్, అమెరికా మార్టిగేజ్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగించనుందని బ్లూమ్‌బర్గ్ నివేదిక (Bloomberg) వెల్లడించింది. ఇది కంపెనీలో పనిచేస్తున్న మొత్తం 2,40,000 మంది ఉద్యోగుల్లో ఒక శాతం మాత్రమేనని పేర్కొన్నది. ఉద్యోగుల తొలగింపు అనేది తమ వార్షిక ప్రణాళికలో భాగంగా సాధారణంగా జరిగే ప్రక్రియేనని సంస్థ వెల్లడించినట్లు పేర్కొన్నది. ఒక్కో విభాగంలో ఒక్కో కారణంతో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారని తెలిపింది.
ఇప్పటికే సిటీ గ్రూప్ పోటీదారైన జేపీ మోర్గాన్ (JPMorgan) సంస్థ గతవారం వందల సంఖ్యలో ఉద్యోగులను వదిలించుకున్నది. జనవరి నెలలో గోల్డ్‌మ్యాన్ సాచ్స్ దాదాపు 3200 మంది ఉద్యోగులపై వేటు వేసింది. వారిలో 7 వందల నుంచి 8 వందల మంది ఉద్యోగులు భారత్‌లోనే ఉన్నారు. ఉద్యోగులను తొలగింపులో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి సంస్థలు చాలా ముందున్నాయి. బ్రిడ్జివాటర్ అసోసియేట్స్ కూడా సుమారు 100 మంది ఉద్యోగులను తొలగించింది.
కాగా, దేశ బ్యాంకింగ్ రంగంలో 121 ఏండ్ల చరిత్ర కలిగిన సిటీ బ్యాంక్ (City Bank) ప్రముఖ ప్రైవేటు బ్యాంకు అయిన యాక్సిక్ (Axis Bank)బ్యాంకులో విలీనమైంది. కన్జ్యూమర్ బిజినెస్, ఎన్బీఎఫ్సీ వంటి అన్ని విభాగాలను యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసింది. 2021 మార్చిలోనే రెండు బ్యాంకులు దీనికిసంబంధించిన ఒప్పందం చేసుకున్నాయి. రూ.12,325 కోట్లు డీల్ కుదుర్చుకున్నది. సిటీ బ్యాంక్ 1902లో భారత్‌లో తొలిసారి అడుగుపెట్టింది సిటీ బ్యాంక్. కోల్‌కతాలో ఆఫీసును ప్రారంభించింది.