వాషింగ్టన్, మార్చి 26: సోషల్ మీడియా వెట్టింగ్ నిబంధనను అమెరికా మరికొన్ని వీసా క్యాటగిరీలకు విస్తరించింది. ఇప్పటికే హెచ్-1బీ, మరికొన్ని వీసాలకు ఈ నిబంధన అమలు చేస్తుండగా, మరిన్ని క్యాటగిరీలకు దీనిని తప్పనిసరి చేస్తూ, మార్చి 30 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఏ-3, సీ-3 (డొమెస్టిక్ వర్కర్లు), జీ-5, హెచ్-3, హెచ్-4 (హెచ్-3 డిపెండెంట్స్), కె, క్యూ, ఆర్, ఎస్, టీ, యూ వీసాల దరఖాస్తుదారులకు కూడా ఇక నుంచి సోషల్ మీడియా వెట్టింగ్‌ను తప్పనిసరి చేయనున్నారు. కాగా, గత ఏడాది జాతీయ భద్రత పేరుతో అమెరికా ఈ నిబంధనను తెచ్చింది.
డిసెంబర్ నుంచి హెచ్-1బీ, హెచ్-4, ఎఫ్, ఎం, జే వీసాల క్యాటగిరీలకు దరఖాస్తు చేసుకున్న వారి సోషల్ మీడియా కార్యకలాపాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నది. దరఖాస్తుదారులు సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఎలాంటి కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్నారు? వారి వల్ల దేశ భద్రతకు ముప్పు ఏమైనా ఉందా? అన్న విషయాలను వారు క్షుణ్నంగా పరిశీలిస్తారు. సోషల్ మీడియా ప్రొఫైళ్లపై సంతృప్తి చెందిన తర్వాతే వారికి వీసా మంజూరు చేస్తారు.