న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: అమెరికన్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీ వలసదారుల కోసం ఈ ఏడాదిలో కొత్త తరహాలో నేచురలైజేషన్ సివిక్స్ టెస్ట్‌ని నిర్వహించనున్నట్లు అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఫెడరల్ రిజిస్టర్లో నోటీసు విడుదల చేసినట్లు పేర్కొంది. అమెరికన్ పౌరసత్వం పొందాలంటే విదేశీ పౌరులు తప్పనిసరిగా ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది. అమెరికా చరిత్ర, ప్రభుత్వంపై దరఖాస్తుదారునికి ఉన్న అవగాహనను ఈ పరీక్ష ద్వారా అంచనా వేయడం అమెరికన్ చట్టాల ప్రకారం తప్పనిసరి. అమెరికన్ సమాజం పట్ల, పౌరుల హక్కులు, బాధ్యతలను పరిరక్షించడం, కాపాడడం పట్ల విదేశీ పౌరులకుగల అవగాహనను అంచనా వేయడం ఈ పరీక్ష లక్ష్యమని తెలిపింది. అమెరికన్ పౌరసత్వం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనదని, అమెరికన్ విలువలు, సిద్ధాంతాలను పూర్తిగా అర్థం చేసుకుని పాటించే విదేశీ పౌరులకే తమ దేశ పౌరసత్వం లభిస్తుందని యూఎస్సీఐఎస్ ప్రతినిధి మాథ్యూ ట్రాజెసర్ స్పష్టం చేశారు.
ఇంగ్లిష్‌లో చదవడం, రాయడం, మాట్లాడడం, అమెరికా ప్రభుత్వంపైన, పౌరుల హక్కులు బాధ్యతలపైన అవగాహన ఉండ డం వంటి అర్హతలన్నీ ఉన్న వారికే అమెరికన్ పౌరసత్వం కల్పించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. తమతోపాటు అమెరికన్ పౌరులుగా జీవించదలచిన వారు అమెరికా వైభవానికి కృషి చేయడంతోపాటు దేశ చట్టాలకు లోబడి నడుచుకోగలరన్న నమ్మకం దేశ పౌరులకు కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని ప్రభుత్వం భావిస్తోంది. చట్టవిరుద్ధంగా ఓటింగ్‌లో పాల్గొనడం, చట్టవిరుద్ధంగా ఓటు హక్కు కోసం పేరు నమోదు చేసుకోవడం వంటివి అనైతిక ప్రవర్తనలుగా పరిగణిస్తారు.