Benedict | మాజీ పోప్ బెనెడిక్ట్ (95) ఆరోగ్యం విషమించింది. ఆయన ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వయసు సంబంధ ఆరోగ్య సమస్యలతో బెనెడిక్ట్ దవాఖానలో చేరారు. బెనెడిక్ట్ 9 సంవత్సరాల క్రితం చర్చి అత్యున్నత పదవికి రాజీనామా చేశారు. బెనెడిక్ట్ పరిస్థితి విషమంగా ఉన్నదని, వృద్ధాప్య సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాడని వాటికన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘పోప్ బెనెడిక్ట్ కోసం ప్రార్థించాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అతని పరిస్థితి విషమంగా ఉన్నది’ అని ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండు వేల సంవత్సరాల వాటికన్ చర్చి చరిత్రలో బెనెడిక్ట్ పదవీకాలం అనేక వివాదాలతో చుట్టుముట్టింది.
పోప్ బెనెడిక్ట్ XVI 2013లో పోప్ పదవికి రాజీనామా చేసి కేథలిక్ క్రైస్తవులను దిగ్భ్రాంతికి గురి చేశారు. ఆరోగ్యం క్షీణించడం వల్ల పోప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు అప్పట్లో బెనెడిక్ట్ ప్రకటించాడు. దాదాపు 600 ఏండ్లలో పోప్ పదవి నుంచి ఇలా అర్ధాంతరంగా వైదొలగడం ఇదే తొలిసారి. ఈయన కంటే ముందు 1415లో క్రైస్తవుల రెండు గ్రూపుల మధ్య ఘర్షణల కారణంగా గ్రెగొరీ XII రాజీనామా చేశాడు.
బెనెడిక్ట్ 1977 నుంచి 1982 వరకు మ్యూనిచ్ ఆర్చ్ బిషప్గా ఉన్న కాలంలో పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ విషయంపై విచారణను జర్మన్ న్యాయ సంస్థకు స్వయంగా చర్చినే అప్పగించింది. ఈ నేపథ్యంలో వాటికన్ క్రిమినల్ చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. లైంగిక వేధింపుల కేసుల్లో చట్టాన్ని మరింత కఠినంగా రూపొందించారు.