Elon Musk : సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ (Instagram) పై ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇన్స్టాగ్రామ్ కేవలం అమ్మాయిల కోసమేనంటూ సోషల్ మీడియాలో చర్చకు తెరతీశారు. సోషల్ మీడియాలో ప్రజల అలవాట్లు, వారి జీవితంలోని వివిధ దశలు ఎలా ప్రతిబింబిస్తాయనే అంశంపై ఓ వైరల్ థ్రెడ్ నడుస్తోంది. అందులో ఫొటోలు పెట్టడం, రీల్స్ చేయడం, వంట ఫొటోలు షేర్ చేయడం వంటి పనులను ప్రస్తావిస్తూ జోకులు పేలాయి.
ఈ చర్చలోకి ఎలాన్ మస్క్ ఎంటరయ్యారు. ఇన్స్టాగ్రామ్ అమ్మాయిల కోసమే అంటూ కామెంట్ చేశారు. అంతటితో ఆగకుండా ‘కొంతమంది మగవాళ్లు తమ ఇన్‌స్టా ప్రొఫైల్స్ నాకు పంపుతుంటారు. అప్పుడు నాకు వాళ్లేమైనా లింగమార్పిడి చేయించుకుంటున్నారా అనిపిస్తుంది’ అని మస్క్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. దాంతో ఆయనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
మస్క్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారేం కాదని యూజర్స్ చెబుతున్నారు. ఆయనకు సోషల్ మీడియాలో యూజర్లను రెచ్చగొట్టడం (రేజ్ బైటింగ్) బాగా అలవాటని అంటున్నారు. అలాగే లింగమార్పిడిపైనా ఆయనకు కొన్ని కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. అయితే మస్క్.. తన ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్‌ను ప్రమోట్ చేసుకోవడంలో భాగంగానే ఇన్‌స్టాపై అక్కసు వెళ్లగక్కుతారనే విమర్శలు ఉన్నాయి.