ఫ్లోరిడా: యుద్ధాలపై తనకు ఆసక్తి లేదని డోనాల్డ్ ట్రంప్(Donald Trump) పేర్కొన్నారు. కొత్తగా యుద్ధాలు స్టార్ట్ చేయను అని, వాటిని ఆపుతానని ఆయన అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మద్దుతుదారులను ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగం చేశారు. తన రెండవ పరిపాలన.. అమెరికాకు స్వర్ణ యుగాన్ని తీసుకువస్తుందన్నారు. స్వదేశీ విధానాలపై తన విక్టరీ ప్రసంగంలో ట్రంప్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ దేశానికి బలమైన , శక్తివంతమైన మిలిటరీ కావాలన్నారు. కానీ ఆ సైన్యాన్ని యుద్ధాలకు వాడకూడదన్నారు.
తన మొదటి దశలో 2017 నుంచి 2021 వరకు యుద్ధాలు లేవని, అమెరికా ఎటువంటి కొత్త సమస్యల్లో తలదూల్చలేదన్నారు. నాలుగేళ్లు యుద్ధాలు లేవని, కేవలం ఐసిఎస్ను ఓడించామని, రికార్డు టైంలో ఐసిస్ పై విక్టరీ సాధించినట్లు చెప్పారు. యుద్ధాలను స్టార్ట్ చేస్తారని తనపై ఆరోపణలు చేశారని, కానీ తానేమీ కొత్త యుద్ధాలను ప్రారంభించడం లేదని, యుద్ధాలను ఆపబోతున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
ఒకవేళ తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే కేవలం 24 గంటల్లోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపనున్నట్లు ట్రంప్ పేర్కోన్న విషయం తెలిసిందే.