ఉక్రెయిన్ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తెగ మెచ్చుకున్న విషయం తెలిసిందే. తీరా… ఆదివారం నాటికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అదే ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఆయన అధికార గణంపై కూడా ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేయడం అత్యంత పాశవికమని ఆక్షేపించారు. కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ మాట్లాడుతూ… పై వ్యాఖ్యలు చేశారు. ఈ దాడులను తాను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది అత్యంత భయంకరమైన సంఘటనగా అభివర్ణించారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయడం అత్యంత భీతిగొలిపే విషయం. ఇలాంటి దౌర్జన్యం, దుశ్చర్య, భీతిగొలిపే అంశం ఎప్పటికీ జరగనేకూడదు. ఉక్రెయిన్ ప్రజల యోగక్షేమాల కోసం ప్రార్థనలు చేస్తున్నాం అంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.
ఇంతటి భయంకర, భీతిగొలిపే పరిస్థితుల్లో కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చూపిస్తున్న ధైర్యం, తెగువ ఎంతో ప్రశంసనీయమని ట్రంప్ పేర్కొన్నారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా తనకు సన్నిహిత సంబంధాలే వున్నాయని, తాను గనక అధికారంలో వుంటే ఇలా జరిగేది కాదని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఓ తబలాను వాయించినట్లుగా పుతిన్ అమెరికా అధ్యక్షుడు బిడెన్‌ను వాయిచేస్తున్నారని ట్రంప్ ఘాటు విమర్శలు చేశారు.
దొహెట్స్క్, లుహాన్స్క్లను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తూ పుతిన్ తీసుకున్న నిర్ణయం పుతిన్ మేధస్సుకు నిదర్శనమని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కొద్ది రోజుల క్రిందటే తెగ మెచ్చుకున్నారు. ఈ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి రష్యా సేనలను పంపించడాన్ని కూడా ట్రంప్ సమర్థించారు. పుతిన్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, పుతిన్ గురించి తనకు బాగా తెలుసన్నారు. తాను గనక అధికారంలో ఉంటే ఇలా జరిగేది కాదని ట్రంప్ చెప్పుకొచ్చారు.