బీజింగ్, జూన్ 18: రాత్రి మంచి నిద్రలో ఉన్నప్పుడు లఘుశంక తీర్చుకోవాల్సిన అవసరం ఏర్పడితే.. బెడ్ మీది నుంచి లేచి బాత్రూమ్ వరకూ నడువాలంటే.. చాలామంది ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఇక మధుమేహం ఉన్న వాళ్లయితే రాత్రి కనీసం రెండు, మూడుసార్లయినా లేవాల్సి వస్తుంది. వీరికోసమే చైనాకు చెందిన టెక్ బ్రాండ్ యూబాన్ ఓ రోబో టాయ్‌లెట్‌ను తయారుచేసింది. ఇది సెల్ఫ్‌డ్రైవింగ్ టాయ్‌లెట్. ఓ బటన్ ప్రెస్ చేసినా, లేక పిలిచినా ఎంతో విధేయంగా అది దాని యజమాని వద్దకు వస్తుంది.
ఈ టాయ్లెట్లో లఘుశంక మాత్రమే కాదు దీర్ఘశంక కూడా తీర్చుకోవచ్చు. దీనికున్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. అది తనంతట తానే ఫ్లష్ (శుభ్రం) చేసుకుంటుంది. దీనికి ‘షావోబాన్’ అంటే ‘చిన్ని నేస్తం’ అని పేరు పెట్టారు. ఎటొచ్చీ దీని ధర వింటేనే వచ్చే ‘శంక’లన్నీ ఆగిపోయేలా ఉంది. చైనా కరెన్సీలో 28,999 యువాన్లు అనగా మన రూపాయల్లో కేవలం నాలుగు లక్షలు మాత్రమే. వృద్ధులు, అనారోగ్యంతో మంచం దిగలేని వారి కోసమే ఈ పరికరాన్ని రూపొందించామని యూబాన్ ఇంజినీర్లు పేర్కొన్నారు.
ఈ నడిచే టాయ్‌లెట్‌ను ఈ నెల 5న షాంఘై ఇంటర్నేషనల్ ఏజ్డ్ కేర్‌లో నిర్వహించిన మెడికల్ ఎక్స్‌పోలో ఆవిష్కరించారు. వైఫై సదుపాయం లేకపోయినా ఆఫ్‌లైన్‌లో సైతం ఇది పనిచేస్తుందని, పిలిస్తే చాలు చెంతకు చేరుతుందని వివరించారు. వినియోగదారులు ఆ టాయ్లెట్పై తమ పని ముగించుకోగానే దానిలోనుంచి ముందుగా వెచ్చటి నీరు వచ్చి శుభ్రం చేసే సదుపాయం, ఆరబెట్టడానికి గాలిని వెదజల్లే వ్యవస్థ ఉన్నాయి. ఆ తరువాత ఆ వ్యవస్థ అంతా క్రిమిరహితం కావడానికి చివరిగా అతినీలలోహిత కాంతి ప్రసరిస్తుంది. ఈ యంత్రం తనంతట తాను ఫ్లష్ చేసుకోవడానికి దానిని ఇంట్లోని డ్రైనేజీ పైప్‌లైన్ వ్యవస్థకు అనుసంధానం చేయవచ్చు. మనం ఇచ్చే ఆదేశాలను బట్టి అది నేరుగా ఆ పైప్ వద్దకు వెళ్లి శుభ్రం చేసుకుంటుంది లేదా నేరుగా బాత్రూమ్లోకి వెళ్లి శుభ్రం చేసుకొనే సదుపాయం కూడా కల్పించామని దాని రూపకర్తలు వివరించారు.