Anti-Hate Act : కెనడా (Canada) చట్టసభ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. విద్వేషపూరిత చర్యలు, నేరాలను అరికట్టేందుకు తీసుకొచ్చిన కంబాటింగ్ హేట్ బిల్లు (Combatting Hate Bill) కు ఆ దేశ చట్టసభ ఆమోదం తెలిపింది. ఈ కీలక బిల్లుకు హౌస్ ఆఫ్ కామన్స్ ఆమోదముద్ర వేసింది. అనంతరం ఆ బిల్లును ఎగువసభకు పంపించారు.
ఈ బిల్లు చట్టంగా మారి అమలులోకి వస్తే ప్రార్థనా స్థలాలపై దాడులకు, ఖలిస్థానీ మద్దతుదారుల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చట్టం ప్రకారం విద్వేష చిహ్నాలను బహిరంగంగా ప్రదర్శించడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఈ చట్టం కోసం కెనడాలోని భారత సంతతి వ్యక్తులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారు.
కెనడాలో ఖలిస్థానీల ఆగడాలు పెరిగిపోయాయి. కొన్ని వర్గాల వారిని లక్ష్యంగా చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతుండటం, విధ్వంసం సృష్టించడం తదితర ఘటనలు పెరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలపై అక్కడి భారతీయులు చాలా ఏళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో విద్వేష చర్యలకు సంబంధించి కొత్త బిల్లు ఆమోదం పొందడం ఆహ్వానించదగిన పరిణామంగా చెప్పవచ్చు.