కాన్బెర్రా : ఉక్రెయిన్ నుంచి సైనిక బలగాలను ఉపసంహరించాలని సూచిస్తూనే.. మరో వైపు రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో రవాణా సంస్థ కమాజ్, షిప్పింగ్ కంపెనీల్ సేవ్మాష్, యునైటెడ్ షిప్‌బిల్డింగ్ కార్పొరేషన్ వంటి రక్షణ సంబంధిత సంస్థలున్నాయి. రష్యా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే సంస్థలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు మద్దతును పునరుద్ఘాటిస్తూ, ఆస్ట్రేలియన్ ప్రభుత్వం రష్యా ప్రభుత్వ ఆదాయ వనరులను లావాదేవీలను నిరోధించడం ద్వారా రష్యాపై ఒత్తిడిని పెంచుతున్నది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ప్రారంభించింది. ఉక్రెయిన్‌పై రష్యా వెనక్కి తగ్గకపోవడంతో పాశ్చాత్య దేశాలు మాస్కోపై అనేక రకాలు ఆంక్షలు విధిస్తూ ఒత్తిడి తెస్తున్నాయి.