పీట్స్బర్గ్, ఫిబ్రవరి 15: ఎవరైనా ఒక డిగ్రీని చదవడానికి గరిష్టంగా ఐదేళ్లో, ఆరేళ్లో తీసుకుంటారు. కానీ పీహెచ్డీ పట్టా పొందడానికి ఏకంగా 53 ఏండ్లు తీసుకున్నాడు 75 ఏండ్ల డాక్టర్ నిక్స్ ఆక్స్టన్. అతను పీహెచ్డీ చదివేందుకు 1970లో పీట్స్బర్గ్ యూనివర్సిటీలో చేరాడు. అయితే అది పూర్తి చేయకుండానే ఐదేండ్ల తర్వాత యూకేకు వచ్చాడు. అలా ఏండ్లు గడిచిపోయిన తర్వాత మళ్లీ చదువుకోవాలన్న యావ నిక్స్కు పుట్టింది. దీంతో 2016లో అతను బ్రిస్టల్ యూనివర్సిటీలో ఎంఏ ఫిలాసఫీ చదివాడు. తర్వాత అదే యూనివర్సిటీలో ఫిలాసఫీలో పీహెచ్డీ చేసి తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు. ఈ నెలలో యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో తన భార్య, మనవరాలి ఎదుట పీహెచ్డీ పట్టాను అందుకున్నాడు. మొత్తానికి పీహెచ్డీ చదువును 53 ఏండ్ల తర్వాత పూర్తి చేసి అందరితో ప్రశంసలు పొందుతున్నాడు.