న్యూయార్క్: అమెరికాలో వృద్ధులను టార్గెట్ చేస్తూ సుమారు 7.5 మిలియన్ డాలర్ల స్కామ్(US Scam)కు పాల్పడిన 21 ఏళ్ల భారత సంతతి వ్యక్తిని అరెస్టు చేశారు. అమెరికా కోర్టులో అతనిపై నేరాభియోగాన్ని నమోదు చేశారు. నిందితుడిని గుజరాత్‌కు చెందిన జయ సునిల్భారతి గోస్వామిగా గుర్తించారు. అతను న్యూజెర్సీలో నివసిస్తున్నాడు. అయితే ఖతార్‌కు పరారీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న అతన్ని కెనడాలో పట్టుకున్నారు. వైర్ ఫ్రాడ్, మనీల్యాండరింగ్ కేసులను అతనిపై నమోదు చేసినట్లు యూఎస్ అటార్నీ మైఖేల్ డిజియాకమో తెలిపారు. ఒకవేళ అతనిపై నేరం రుజువైతే, అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష పడనున్నది.
వృద్ధ బాధితుల నుంచి నగదు, బంగారం కలెక్టు చేసినట్లు తెలుస్తోంది. వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ ఆధారంగా ఫ్రాడ్ స్కీమ్‌కు పాల్పడినట్లు జనవరిలో గుర్తించారు. ఐఆర్ఎస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ దీనిపై ఆరా తీసింది. బ్యాంకు అకౌంట్లు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కంప్రమైజ్ అయినట్లు తొలుత బాధితులను నమ్మించారు. ఆ తర్వాత వారి ఆస్తులను.. నగదు, బంగారం, గిఫ్ట్ కార్డులుగా మార్చుకోవాలని వత్తిడి తెస్తారు. పోలీసులమని చెప్పి స్కీమ్‌లోకి దింపుతారు. మనీ మ్యూల్ పాత్రలో గోస్వామి వ్యవహరించినట్లు అమెరికా కోర్టు తేల్చింది. బాధిత వృద్ధుల నుంచి వ్యక్తిగతంగా గోల్డ్ లేదా డబ్బును సేకరించేవారు. న్యూయార్క్, న్యూజెర్సీల్లో 9 సార్లు వృద్ధ బాధితుల నుంచి క్యాష్, గోల్డ్ సేకరించాడు. ఆ బాధితుల వయసు 59 నుంచి 87 మధ్య ఉంది.
బ్యాంక్ ఆఫ్ అమెరికాలో గోస్వామి అకౌంట్ ఓపెన్ చేసి, సుమారు 90 వేల డాలర్ల క్యాష్ డిపాజిట్ చేశాడు. 2025 ఆగస్టు నుంచి 2026 ఏప్రిల్ వరకు ఈ దందా సాగించాడు. 2026, ఆగస్టు 17వ తేదీన అమెరికా మెజిస్ట్రేట్ జడ్జ్ మార్క్ డబ్ల్యూ పీడర్సెన్ షరతుల మీద గోస్వామిని రిలీజ్ చేశారు. అయితే తర్వాత రోజు పీస్ బ్రిడ్జ్ మార్గంలో అతను కెనడాకు పరారీ అయ్యాడు.ఇక టొరంటో నుంచి దోహాకు ఫ్లయిట్ బుక్ చేసుకున్నాడు. కానీ టొరంటో విమానాశ్రయంలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు.