Plane Crash | ఓ విమానం కూలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటల ధాటికి విమానం సహా ఆ ప్రాంతంలోని చెట్లన్నీ కాలి బూడిదయ్యాయి. కానీ విమానంలో ఉన్న ఇద్దరు పైలెట్స్ మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిట్జ్‌గెరాల్డ్ నేషనల్ పార్క్‌లో బోయింగ్ 737 వాటర్ బాంబింగ్ విమానం సోమవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో భారీగా మంటలు చెలరేగి.. ఆ ప్రాంతంలో దట్టంగా పొగ ఆవహించింది. ఈ ప్రమాదంలో విమానం మొత్తం కాలి బూడిదైంది. దాని తోక భాగం మాత్రం కనిపిస్తోంది. ఈ ఘోర ప్రమాదం నుంచి ఇద్దరు పైలెట్స్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా మంత్రి స్టీఫెన్ డాసన్ తెలిపారు. ఇదో మిరాకిల్ అని అన్నారు. ‘ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు పైలెట్స్ సురక్షితంగా బయటపడటం మిరాకిల్’ అని పేర్కొన్నారు. అదొక ఎయిర్ ట్యాంకర్ విమానం అని.. ఆయా ప్రాంతాల్లో నీటిని సరఫరా చేశాకా కూలినట్లు ఆయన వెల్లడించారు. కాగా, విమానం కూలిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.