న్యూయార్క్, మే 9: వేతనం, ప్రమోషన్లు, పనితీరు విశ్లేషణ తదితర అంశాల్లో మహిళా ఉద్యోగులపై వివక్ష చూపించిన కేసును అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్‌మాన్ శాక్స్ రూ. 1,763 కోటు చెల్లించి సెటిల్ చేసుకోనుంది. 2010లో గోల్డ్‌మాన్ శాక్స్‌పై ఉద్యోగినులు న్యూయార్క్ కోర్టులో దాఖలు చేసిన క్లాస్ యాక్షన్ లా సూట్ వచ్చే నెలలో విచారణకు రానుంది. గోల్డ్‌మాన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, సెక్యూరిటీస్ డివిజన్లో పనిచేస్తున్న 2,800 మంది మహిళా అసోసియేట్లు, వైస్ ప్రెసిడెంట్లకు ఈ సొమ్ము అందుతుంది. వాల్‌స్ట్రీట్‌లో పటిష్ఠ మహిళలకు మద్దతుగా ఈ కేసు వేశామని, తాము సాధించిన ఫలితం కారణంగా లింగ సమానత్వం సాధించగలిగామని లా సూట్ వేసిన అలిసన్ గాంబా తెలిపారు. సెటిల్మెంట్లో భాగంగా పరిహారం చెల్లింపుతో పాటు పనితీరు విశ్లేషణ, వైస్ ప్రెసిడెంట్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ వరకూ ప్రమోషన్ల ప్రక్రియను గోల్డ్‌మాన్ ఒక స్వతంత్ర నిపుణుడితో కలిసి నిర్వహించాలి. అలాగే కంపెనీలో పురుష, మహిళా ఉద్యోగుల మధ్య వేతన వ్యత్యాసాలపై ఒక స్వతంత్ర నిపుణుడు దర్యాప్తు చేస్తారు. మహిళల ఉన్నతికి గోల్డ్‌మాన్ శాక్స్ కట్టుబడి ఉందని, దశాబ్దానికిపైగా నలుగుతున్న కేసును పరిష్కరించుకోవాలని ఇరు పార్టీలు అంగీకరించాయని కంపెనీ హ్యుమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ గ్లోబల్ హెడ్ జాక్విలిన్ అర్థర్ చెప్పారు.