సిటీబ్యూరో, ఏప్రిల్ 20 ( నమస్తే తెలంగాణ ) : ఓ వైపు 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నగరంలో దంచి కొడుతుంటే ఆ వేడి దాడికి ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మరోవైపు వాహనాల్లోనైనా బయటకొచ్చే పరిస్థితి ఉందా అంటే అది కూడా ప్రమాదకరంగానే కనిపిస్తోంది. నగరంలో గత రెండు వారాల్లో 20కి పైగా వాహన అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఇటీవల బేగంపేట, అమీర్‌పేట, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో కార్లలో మంటలు వ్యాపించిన ఘటనలు వాహనదారులను భయబ్రాంతులకు గురి చేశాయి.
ప్రయాణంలో ఉండగానే కార్లలోంచి పొగలు వచ్చి నిమిషాల్లోనే పూర్తిగా దగ్ధమవుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. అయితే కేవలం భానుడి భగభగలతో వాహనాల్లో మంటలు వ్యాపిస్తాయా అంటే అత్యధిక శాతం ప్రభావం ఉన్నప్పటికీ.. కొంత వరకు వాహనాన్ని మెయింటెనెన్స్, సర్వీసింగ్ చేయకపోవడం కూడా కారణమేనని మెకానిక్ నిపుణులు చెబుతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతల్లో చిన్న స్పార్క్ కూడా పెద్ద మంటలకు కారణమవుతున్నది.
వైరింగ్‌లో నాణ్యత లోపం, ఇంజన్ వేడెక్కడం, ఆయిల్, డీజిల్, పెట్రోల్, గ్యాస్ లీకేజ్ కారణంగా మంటలు అంటుకోనే ప్రమాదం ఉంది. ఎక్కువ దూరం తిరిగే వాహనాలను తరుచూ తనిఖీ చేయించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్రమాదాలు అధికంగా జరుగుతాయి. కాలపరిమితి ముగిసినవి, నాణ్యతలేని బ్యాటరీలతో మంటలు త్వరగా చెలరేగుతాయి. వాహనంలో అత్యంత ఉష్ణోగ్రత ఉండే వాటిలో కాటలిటిక్ కన్వర్టర్ ఒకటి. ఇది కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ లాంటి విషపూరిత వాయువులను వడగట్టి కాలుష్యపు పొగను బయటికి పంపిస్తుంటుంది.
దీనికి ముందుండేది ఇంజిన్. స్ఫార్క్ ప్లగ్‌లు, ఇతర పార్ట్స్‌లో ఏదైనా లోపం ఉంటే ఇంజిన్‌లో ఇంధనం సరిగా మండదు. అత్యధిక వ్యర్థాలు పొగవుతుంటాయి.అప్పుడు భారమంతా కాటలిటిక్ కన్వర్టర్‌పై పడుతుంది. సాధారణంగా 900 డిగ్రీల సెంటీగ్రేడ్‌తో వేడిగా ఉండే ఈ విభాగం 1100 డిగ్రీలకు చేరుతుంది. ఫలితంగా చుట్టుపక్కలుంటే హీట్ షీల్డ్‌లు,మెటల్ ఫ్లోర్ ప్యాన్లు, వేడెక్కి క్యాబిన్ ఇన్సులేషన్ కార్పెటింగ్‌లను కూడా దహించి వేస్తాయి. కారులో అయితే బ్యానెట్ కింద, ఇంటీరియర్‌లో, డోర్లు, కార్పెట్ కింద, సీట్లకింద, ఎక్కడంటే అక్కడ ఉంటాయి. గ్యాస్‌లు లీక్ కావడం, గ్యాస్కెట్, రేడియేటర్లలో పగుళ్లు కూడా మంటలు పుట్టడానికి కారణమవుతాయి.

పెట్రోల్, డీజిల్, ఇంజిన్ ఆయిల్, ట్రాన్స్మిషన్ ఫ్లూయిడ్, పవర్‌స్టీరింగ్ ఫ్లూయిడ్, బ్రేక్ ఫ్లూయిడ్, కూలంట్, ఇవన్నీ కారు నడుస్తున్నప్పుడు సర్క్యూలేట్ అవుతుంటాయి. ఇవి ప్రవహించే ద్వారాలు, పైపులు, నిల్వ ఉండే రిజర్వాయర్లు పాడై లీకేజి అయినా, పగలిపోయినా మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. పెట్రోల్ సాధారణంగా 7.2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. మండినప్పుడు 258 డిగ్రీలకు చేరుకుంటుంది. దీనిబట్టీ మంట ఎంత త్వరగా వ్యాపిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
నగరంలో రోజు రోజుకు కార్ల వినియోగం పెరిగి పోతోంది. వాటితో పాటు పుట్టగొడుగుల్లా సర్వీసు సెంటర్లు కూడా వెలుస్తున్నాయి. దీంతో అనేక మంది వాహనదారులు అధీకృత సర్వీసు డీలర్ల వద్ద వాహనాలు సర్వీసులకు ఇవ్వకుండా సాధారణ సర్వీసు సెంటర్లపైపు మొగ్గు చూపుతున్నారు. కార్లను నిపుణులైన వారి వద్దనే సర్వీలు చేయించాలి. ఇంధన మండించే విద్యుత్ ఉపకరణాలకు అనుసంధానం ఉండాలి. స్పార్( మంట) ఇంధన సరఫరా పైపులో లోపాలు ఉంటే సమస్యలు వస్తాయి. కారును తుడిచే పాత వస్త్రాలకు తరచూ పెట్రోల్, డీజిల్ అంటుకుంటూ ఉంటాయి. వాటిని శుభ్రం చేయకుండా కారు బోయినెట్లో పెట్టడంతో షార్ట్ సరూట్ అయ్యి నిప్పు అంటుకుంటుంది.
వాహనాలను నిర్ణీత సమయాల్లో క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలి. ప్రతీ కారు 4 వేల కిలోమీటర్లు తర్వాత సర్వీసింగ్‌కు ఇవ్వాలి. ఆ సమయంలో పాడైపోయిన ఎయిర్ ఫిల్టర్లు, ఆయిల్ ఫిల్టర్లు, ఇంజిన్ కూలంట్, ఇంజిన్ ఆయిళ్లు మార్చుతారు. ఇవి భవిష్యత్తు ప్రమాదాలను నివారిస్తాయి. లిక్విడ్, ఫ్లూయిడ్ లికేజీలను తరుచూ పరిశీలిస్తూ సరిచేసుకోవాలి. ఓవర్ హీటింగ్ సమస్యలు తీరతాయి. వేసవిలో కార్లలో ఏసీల వాడకం ఎక్కువ. వీటిని ఎక్కువ సమయం హై మోడ్‌లో పెడితే కంప్రెషర్ మీద భారం ఎక్కువై ఇంజిన్ కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగే అవకాశం ఉంది. వీలైతే మధ్యమధ్యలో ఆఫ్ చేస్తూ ఉండాలి. చల్లని ప్రదేశాల్లో వాహనాలను పార్క్ చెయ్యా లి. పొగలు వచ్చేటప్పుడు హెచ్చరించే స్మోక్డిటెక్టర్స్ను అమర్చుకోవాలి. ఫైరెస్టింగ్ మిషన్ ఏర్పాటు చేసుకోవాలి.డియోడెంట్రలు, ఎయిర్ ఫ్రెష్నర్లు, ఇతర స్ప్రేలు, సిగార్ లైట్లు కు మండే గుణం ఉంది. కనుక వీటిని కారులో ఉంచొద్దు.
కార్లలో ఎక్స్ట్రా లైటింగ్ కోసం వైరింగ్ చేయించుకుంటారు. దీనివల్ల ఓవర్ లోడ్ అయి షార్ట్‌సర్క్యూట్ జరుగుతుంటుంది. యాంటి ఫర్ మెటీరియల్ వాడటం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు. సర్వీసింగ్ చేసే సమయంలో రెగ్యులర్‌గా ఎక్స్ట్రా ఫిట్టింగ్లును తనిఖీ చేయించుకోవాలి. 95 శాతం అగ్ని ప్రమదాలకు కారణం వైరింగే. ఇంజన్‌కు సంబంధించి తక్కువగా ఉంటుంది. మెకానికల్లతో తరుచూ తనిఖీలు చేయించుకోవాలి. హెడ్‌లైట్ ఫోకస్ కోసం ఎక్కువ లైట్లను వాడుతారు. డబుల్ హారన్ పెట్టుకుంటారు.ఇలా చేయడం వల్లే ఎలక్ట్రిక్ వైర్లలో స్పార్క్‌లు వచ్చి అవి మంటలుగా మారుతాయి. కారు నడిపే వ్యక్తికి కారుపై పూర్తి అవగాహన ఉండాలి. -ఎం. మహేందర్, మెకానిక్