ముషీరాబాద్, నవంబర్ 1: అణిచివేతకు, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నడిపి సాహితీ పోరుబాటను కడవరకు కొనసాగించిన ప్రజల మనిషి వట్టికోట అళ్వారు స్వామి అని బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. చిక్కడపల్లి త్యాగరాయగాన సభలో జరుగుతున్న ‘ఎందరో మహానుభావుల మధుర స్మృతులలో’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రముఖ సాహితీవేత్త, కవి వట్టికోట అళ్వారుస్వామి జయంతి సభ జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని అళ్వారు స్వామి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. సాహిత్యాన్ని, జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన మహోన్నత మానవతావాది వట్టికోట అని కొనియాడారు. కథకునిగా, నవలా రచయితగా, నాటకకర్తగా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన దార్శనికుడని తెలిపారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సాహితీవేత్త కోయి కోటేశ్వరరావు, తాళ్లపల్లి చక్రపాణి, శ్రీమణి పాల్గొన్నారు.