సిటీ బ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏండ్ల తరబడిగా విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిలో వంద మందిని తొలగించేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్నారు. కార్మిక చట్టాల్లో లేని నిబంధనలను కొత్తగా తీసుకొచ్చి వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఫిట్నెస్ సర్టిఫికెట్, పోలీసు ఎంక్వైరి సర్టిఫికెట్ ఇవ్వాలంటూ కార్మికులకు సంబంధం లేని నిబంధనలు తీసుకొస్తున్నారని వాపోతున్నారు.
కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ ఎక్కడికి పంపినా వెళ్తామని ఒప్పుకుం టూ అంగీకార పత్రం ఇవ్వాలని వేధిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల టెండర్ దక్కించుకున్న సూర్య ఎంటర్ప్రైజెస్ యజమాని సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడుతూ.. తనకు నచ్చినవారినే విధుల్లో ఉంచుతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు లేని కొత్త రూల్స్ తీసుకొచ్చి ఏండ్ల తరబడిగా యూనివర్సిటీలో విధులు నిర్వర్తిస్తున్న తమను బయటకు పంపే కుట్ర లు చేస్తున్నారని మండిపడుతున్నారు.
ఈ మేరకు అడ్మినిస్టేషన్ భవనం ఎదు ట ఆందోళనలు చేపడుతున్నారు. కాం ట్రాక్టర్ తీరుపై వీసీ, రిజిస్ట్రార్ కనీసం స్పందించకుండా ఆయనకు సపోర్టు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇకపై ఏ కాంట్రాక్టర్ వచ్చినా లేనిపోని నిబంధనలు పెట్టి తమకు ఉద్యోగ భద్రత లేకుండా చేసి.. బయటకు పంపించే ప్రయత్నాలే చేస్తారని.. ఇకపై యూనివర్సిటీ యాజమాన్యమే తమకు వేతనాలిచ్చి పనులు చేయించుకోవాలని డిమాండ్ చేస్తున్నా రు. థర్డ్ పార్టీ వ్యక్తులకు కాకుండా యూనివర్సిటీ పరిధిలోకి కాంట్రాక్ట్ సిబ్బందిని తీసుకోవాలని కోరుతున్నారు.
ఇటీవల వంద మంది కొత్త సిబ్బందిని రిజిస్ట్రార్ నియమించారు. అందు లో భాగంగానే ఇప్పుడున్న 611 మంది సిబ్బందిలోంచి వంద మందిని తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. నూతనంగా వచ్చిన కాంట్రాక్టర్ ద్వారా కఠిన నియమాలు పెడితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చనే కుట్రలు చేస్తున్నట్లు సమాచారం.
కాంట్రాక్టు సిబ్బందిలో 20 ఏండ్లుగా పనిచేస్తున్నవారున్నారు. వారికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్లేలా అంగీకరిస్తూ సంతకాలు తీసుకుంటే వంద మందిని తీసేయొచ్చని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకే సిబ్బంది కాంట్రాక్టర్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నా రిజిస్ట్రార్, వీసీ స్పందించడం లేదని సమాచారం.
రిజిస్ట్రార్ నియమించిన వందమంది కోసం 611 మంది జీవితాలతో చెలగాటమాడటం సరికాదని విద్యార్థి సంఘాలు, కాంట్రాక్ట్ సిబ్బంది అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ సిబ్బందికి కూడా యూనివర్సిటీ నేరుగా జీతాలిచ్చేలా నిబంధనలు సడలించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. థర్డ్ పార్టీకి అప్పగించడం వల్ల వేధింపులు పెరుగుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.