TGSRTC | ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయాణ అనుభూతులతో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఇప్పుడు వ్యాపార రంగంలోనూ సరికొత్త వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. కేవలం ప్రయాణికులను చేరవేయడమే కాకుండా, సంస్థ పరిధిలోని వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ వ్యాపార సముదాయాలను (Commercial Complexes) అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు సంస్థ సిద్ధమైంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి, తమ సంస్థలను విస్తరించుకోవాలనుకునే వారికి ఇది ఒక బంపర్ ఆఫర్‌గా నిలవనుంది.
ప్రజాక్షేత్రంలో వ్యాపార సామ్రాజ్యం :
సాధారణంగా ఏ వ్యాపారానికైనా ‘కస్టమర్ల రాక’అనేది అత్యంత కీలకం. ఆర్టీసీ బస్టాండ్లు, కాంప్లెక్స్‌లు నిరంతరం ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. ప్రతీ రోజూ లక్షలాది మంది ప్రజలు రాకపోకలు సాగించే ఈ ప్రాంతాల్లో వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల, ప్రచార ఖర్చులు లేకుండానే వ్యాపారస్తులకు కస్టమర్లు లభిస్తారు. హోటళ్లు, ఫుడ్ కోర్టులు, సూపర్ మార్కెట్లు, బ్రాండెడ్ షోరూమ్‌ల నుండి చిన్న తరహా దుకాణాల వరకు అన్ని రకాల వ్యాపారాలకు ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్సులు అనువైన వేదికలుగా మారనున్నాయి.
సారథ్య ఆలోచన.. సరికొత్త ఆదాయం :
సంస్థను లాభాల బాట పట్టించడంతోపాటు, స్థానిక నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉన్నతాశయంతో టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. పారదర్శకమైన నిబంధనలు, లీజు పద్ధతుల ద్వారా ఈ స్థలాలను కేటాయించనున్నారు.
వ్యాపారులకు సువర్ణావకాశం :
తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలు, డిపోల పరిధిలో ఉన్న ఈ ఖాళీ వ్యాపార సముదాయాల వివరాలను సంస్థ అధికారిక వెబ్సైట్
tgsrtc.telangana.gov.inలో పొందుపరచడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న 694 షాపులకు త్వరలో టెండర్లు పిలువబడుచున్నవి.
టీజీఎస్ఆర్టీసీ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం అటు రవాణా సంస్థకు అదనపు ఆదాయాన్ని సమకూరుస్తూ, ఇటు వ్యాపార రంగానికి సరికొత్త ఊతాన్ని ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ సువర్ణావకాశాన్ని అందుపుచ్చుకుని వ్యాపారంలో రాణించాలని సంస్థ వర్గాలు కోరుతున్నాయి.
ఆర్టీసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం..
ఆర్టీసీ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ, పారదర్శకతకు పెద్దపీట వేసేలా సంస్థ పరిధిలోని అన్ని వ్యాపార సముదాయాల (Commercial Spaces) వివరాలను యాజమాన్యం అధికారిక వెబ్సైట్లో బహిరంగపరిచింది. ఏ ఏ ప్రాంతాల్లో ఎన్ని వ్యాపార సముదాయాలు ఉన్నాయి… అవి ఖాళీగా ఉన్నాయా లేక నిండిపోయాయా, ప్రస్తుతం ఆ షాప్ లను ఎవరు నిర్వహిస్తున్నారు, వారి లీజు కాలపరిమితి మరియు అద్దె ఎంత అనే పూర్తి సమాచారాన్ని క్లియర్ కట్‌గా ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు.
దళారీ వ్యవస్థకు పూర్తిగా చెక్ పెడుతూ, వ్యాపార ప్రకటనలు మరియు అద్దెదారుల ఎంపికలో డిజిటల్ జవాబుదారీతనాన్ని పెంచేందుకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. టీజీఎస్ఆర్టీసీ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం అటు రవాణా సంస్థకు అదనపు ఆదాయాన్ని సమకూరుస్తూ, ఇటు వ్యాపార రంగానికి సరికొత్త ఊతాన్ని ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
టీజీఎస్ ఆర్టీసీతో చేతులు కలపండి, మీ వ్యాపారాన్ని పెంచుకోండి : ఎండీ వై.నాగిరెడ్డి
ఆర్టీసీ స్థలాల్లో షాప్స్ నిర్వహణ ప్రక్రియను మరింత సరళతరం చేశామని, వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ అవకాశాన్ని వాడుకోవచ్చని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సూచించారు. టీజీఎస్ ఆర్టీసీ కల్పిస్తున్న ఈ సదావకాశం వ్యాపారులకు ఎంతో లాభదాయకమని, దీనిని సద్వినియోగం చేసుకుని వ్యాపార వృద్ధిని సాధించడమే కాకుండా సంస్థ ప్రగతిలో భాగస్వాములు కావాలని ఎండీ వై.నాగిరెడ్డి కోరారు.