సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : సజావుగా సాగుతున్న రవాణా శాఖ సీఎఫ్ఎస్టీ పోర్టల్ సేవలను రద్దు చేసి.. ప్రభుత్వం వాహన్ సారథి పోర్టల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం వాహనదారుల పాలిట శాపంగా మారింది. ఆ పోర్టల్‌లో సేవలు పొందాలంటే అటు వాహనదారులు, ఇటు అధికారులు సైతం నరకం చూస్తున్నారు. ప్రతీ రోజు వాహన్-సారథి పోర్టల్ సాంకేతిక సమస్యలతో వాహనదారుల సహనానికి పరీక్ష పెడుతున్నది. మూడు రోజుల నుంచి వాహన్ పోర్టల్ సేవలు నిలిచిపోయాయి. ఓ దశలో హ్యాకింగ్ జరిగి ఉండొచ్చని ఎన్ఐసీ(నేషనల్ ఇన్‌ఫార్మటిక్ సెంటర్) అనుమానం వ్యక్తం చేసింది. అయితే పోర్టల్‌ను తాత్కాలికంగా నిలిపివేసి పరిశీలించినట్టు ఎటువంటి హ్యాక్ జరిగినట్టు తేలలేదని స్పష్టం చేసింది. కానీ తరుచూ సర్వర్ పనిచేయకపోవడంతో రవాణా శాఖ డేటాపై హ్యాకర్లు కన్నెసే అవకాశం లేకపోలేదని కొందరు నిపుణులు హెచ్చరించారు.
లైసెన్స్ స్లాట్ బుక్ చేసుకోవడం మొదలు లైసెన్స్ వచ్చే వరకు, వాహన్ పోర్టల్‌లో వాహన వివరాలు ఎంటర్ చేయడం మొదలు ఆర్సీ వచ్చే వరకు, వాహన ఓనర్షిప్ బదిలీ, ఫిట్నెస్ తదితర అన్ని రకాల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పోర్టల్ ఇబ్బందులపై వాహన సంఘాలు ఆర్టీఏ ఉన్నతాధికారులను కలిసి రద్దు చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తాము పరిష్కరిస్తామని అప్పుడు చెప్పి.. ఇప్పుడు తమ చేతుల్లో లేదని కేంద్ర సర్వర్ నుంచి అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందని చేతులెత్తేశారు. దీంతో వాహన సంఘాల నాయకులు ఆ పోర్టల్ రద్దు చేసి కేసీఆర్ హయాంలోని సీఎఫ్సిటీ పోర్టల్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.ఆగస్టు 13 నుంచి సారథి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటి నుంచి సాంకేతిక సమస్యలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
1. స్లాట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే కనీసం కంప్యూటర్ అవగాహన ఉన్నవారికి సైతం గంటకు పైగా సమయం పడుతుంది. మొబైల్ నెంబర్, క్యాప్చా, ఓటీపీలు ఇలా ఎన్నో రకాల వివరాలు ఎంటర్ చేయాలి. కాగా ఈ ప్రక్రియలో మళ్లీ పేజీ మొదటి నుంచి ఓపెన్ అవుతుండటం అసహనానికి గురి చేస్తున్నది.
2. ఆటో కొనుగోలు చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ కీలకం. ఆ వివరాలను ఎంటర్ చేస్తే కానీ కొనుగోలు ప్రక్రియ పూర్తికాదు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ల లైసెన్స్ వివరాలు షోరూం నిర్వాహకులు వాహన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయగా డాటా నాట్ ఫౌండ్ అంటూ చూపెడుతుననది.
3. లైసెన్స్‌లో ఇంటి పేరు, పేరుకు మధ్యలో డాట్ ఉంటే కూడా వాహన్ పోర్టల్ ఆ లైసెన్స్ వివరాలను తిరస్కరిస్తున్నది. దీంతో రిజిస్ట్రేషన్, రెన్యువల్‌కు అంతరాయం ఏర్పడుతున్నది.
4. సాధారణంగా ఆటో లైసెన్స్ పొందాలంటే ఆటో రిక్షానే నడపాలి. కానీ ఈ పోర్టల్‌లో ఆటో రిక్షా అనే ఆప్షనే లేదు. దీంతో అధికారులు ఫోర్ వీలర్ అంటే కారు నడపాలని చెబుతున్నారు. ఆటో నడిపే వారు కారు నడిపి లైసెన్స్ పొందాల్సి వస్తుంది. కారు నడపరాకపోతే ఆటో లైసెన్స్ కూడా పొందలేరు.

వాహన్ సారథి పోర్టల్‌తో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. 3 రోజులుగా పోర్టల్ పనిచేయడం లేదు. లైసెన్స్‌లో ఇంటి పేరు పక్కన డాట్(చుక్క) ఉంటే కూడా పోర్టల్ యాక్సెప్ట్ చేయడం లేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. గతంలో ఆటో లైసెన్స్ ఉండేది. ఇప్పుడు ఫోర్ వీలర్ లైసెన్స్ మాత్రమే ఆటో లైసెన్స్‌గా చెబుతున్నారు. ఆటో లైసెన్స్ (త్రీవీలర్) వాహన్ పోర్టల్‌లో లేదు. దీనిపై అధికారులు స్పందించి సమస్య పరిష్కారం చేయాలి.
వాహన్ సారథి పోర్టల్‌ను తెలంగాణ రవాణా శాఖ రద్దు చేయాలి. కేసీఆర్ హయాంలో అమలు చేసిన సీఎఫ్ఎస్టీ పోర్టల్ తీసుకురావాలి. గతంలో ఏదైన వాహన పని ఉంటే ఆ రోజు ఏ సమయంలో మనకు వీలుంటుందో ఆ సమయాన్ని ఎంచుకుని సేవలు పొందేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందులో సూచించిన సమయానికి వెళితే సాంకేతిక సమస్యలతో ఆ రోజంతా అక్కడే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. 2 గంటలు పోర్టల్ పనిచేస్తే మరో గంట ఆగిపోతుంది.