సిటీబ్యూరో, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): పిల్లలు అనేక లోపాలు, సమస్యలు, ప్రాణాంతక ఇబ్బందులతో పుడుతుంటారు. చూడటానికి పిల్లలు బాగానే ఉన్నప్పటికీ తల్లిదండ్రులకు తెలవని ఎన్నో సమస్యలు, లోపాలు పిల్లలను ఆవరించి ఉంటాయి. వైద్యులు చెప్పేంత వరకు పిల్లలకు ఉన్న రోగాలు, సమస్యలు మనకు తెలిసి రావు. ప్రస్తుత ప్రపంచంలో చిన్నారులు అనేక సమస్యలతో పుడుతున్నారు. అందులో ప్రధానమైనది హృద్రోగం. పుట్టుకతోనే హృద్రోగ సమస్యలతో బాధపడే చిన్నారులకు నిమ్స్ గుండె ధైర్యాన్ని ఇస్తోంది. ఒక రోజు వయస్సు గల నవజాత శిశువుల దగ్గర నుంచి 15 ఏండ్ల వయస్సు గల పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె వ్యాధులకు సంబంధించిన శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు నిమ్స్ కార్డియో సర్జరీ విభాగం వైద్యులు. గతంలో చిన్నారులకు సంబంధించి సంవత్సరానికి 30 నుంచి 40 సర్జరీలు, గుండె శస్త్ర చికిత్సలు జరగగా, కొత్తగా ప్రారంభించిన పిడియాట్రిక్ కార్డియో సర్జరీ విభాగం ద్వారా ఇప్పుడు ఏడాదికి 250కి పైగా కేసులకు సేవలందించేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిమ్స్ కార్డియో థొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేష్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే పిడియాట్రిక్ కార్డియో సర్జరీ విభాగం ప్రారంభించిన సంవత్సరంలోపే 180 శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. గత సంవత్సరం జూన్ 23న నిమ్స్‌లో పిడియాట్రిక్ కార్డియో సర్జరీ విభాగాన్ని ప్రారంభించగా, సెప్టెంబర్ అర్దమాసం నుంచి ఇది రోగులకు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. రానున్న మరో నెల రోజుల్లో శస్త్ర చికిత్స సంఖ్య 200లకు చేరుకోనున్నట్లు వైద్యులు చెబుతున్నారు. పుట్టుకతో వచ్చే గుండె వ్యాధులకు సంబంధించిన శస్త్ర చికిత్సలు ఖరీదైనవి కావడంతో నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారుల తల్లిదండ్రులకు ఆర్ధిక భారంతో పాటు చిన్నారులకు గుండె కోత తప్పేది కాదు. దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం రూ.5 కోట్ల వ్యయంతో పిడియాట్రిక్ కార్డియో సర్జరీ విభాగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విభాగం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నిలోఫర్, మిషనరీ హాస్పిటల్స్ నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కేసులు వస్తున్నట్లు నిమ్స్ అధికారులు తెలిపారు.
ఒక్క రోజు శిశువులకు సైతం..
సాధారణంగా తక్కువ బరువున్న శిశువులకు, ఒకటి, రెండు రోజుల వయస్సున్న నవజాత శిశువులకు గుండె శస్త్ర చికిత్సలు చేయడం అత్యంత క్లిష్టమైన పని. ఇలాంటి శస్త్ర చికిత్సలు కార్పొరేట్లో సైతం చేయడానికి సాహసించరు. అంతటి క్లిష్టమైన శస్త్ర చికిత్సలను సైతం నిమ్స్ వైద్యులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఒక రోజు వయస్సు గల శిశువుకు, 1.5 కిలోల అతి తక్కువ బరువున్న శిశువుకు సైతం ఇక్కడ విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు వైద్యులు.
ప్రత్యేక వైద్య పరికరాలతో….
నిమ్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చిన పిడియాట్రిక్ కార్డియో సర్జరీ విభాగంలో ఆరు పడకల సామర్ధ్యం గల ఐసీయూ వార్డుతో, రెండు వార్మర్ బెడ్స్, అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేశారు. కార్పొరేట్‌కు దీటుగా చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు జరిపేందుకు ఈ యంత్రాలు ఎంతో అవసరమంటున్నారు వైద్య నిపుణులు. ఈ యంత్రాల వల్ల నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించే వీలుంటుందని చెబుతున్నారు. ప్రధానంగా హార్ట్ అండ్ లంగ్ వంటి అధునాతన యంత్రాలతో శస్త్ర చికిత్సల సమయంలో సర్జరీ ముగిసే వరకు చిన్నారి గుండెలకు కృత్రిమ సపోర్ట్ అందించడం జరుగుతుందని వైద్యులు వివరించారు.
సెప్టెంబర్ 20న యూకే నుంచి వైద్య బృందం
నిరుపేద చిన్నారులకు పుట్టుకతో వచ్చే క్లిష్టమైన గుండె వ్యాధులకు సంబంధించి నిమ్స్‌లో శస్త్ర చికిత్సలు జరపడంతో పాటు ఇక్కడి వైద్యులకు మరింత మెరుగైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు సెప్టెంబర్ 20న మరోసారి యూకే నుంచి వైద్య బృందం ఇక్కడకు రానుంది. ఈ బృందం నిమ్స్ వైద్య సిబ్బందికి కొన్ని అంశాల్లో శిక్షణ ఇవ్వడమే కాకుండా ఇతర అంశాలలో వారు కూడా మన దగ్గర నుంచి శిక్షణ పొందడం జరుగుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన పిడియాట్రిక్ కార్డియో సర్జరీ విభాగం వల్ల ప్రధానంగా నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు ఎంతో మేలు జరుగుతుంది. పుట్టుకతో వచ్చే గుండె వ్యాధులకు సంబంధించిన శస్త్ర చికిత్సలకు బయట రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ, నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి పథకాల ద్వారా పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నాం. ఈ విషయంలో తెలంగాణ గవర్నమెంట్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇక్కడకు వస్తున్న కేసుల్లో 90 శాతానికి పైగా క్రిటికల్ కేసులే. ఎక్కువగా నిలోఫర్‌తో పాటు కొన్ని మిషనరీ హాస్పిటల్స్ నుంచి కూడా రెఫరల్ కేసులు వస్తున్నాయి. పొరుగు రాష్ర్టాల నుంచి కూడా ఇక్కడకు కేసులు వస్తున్నాయి. త్వరలో చిన్నారులకు అవసరమైతే హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్స్ కూడా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతే కాకుండా మరిన్ని ఆపరేషన్ థియేటర్లు సైతం అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం సంవత్సరం లోపే 180 క్రిటికల్ సర్జరీస్‌ను సక్సెస్‌ఫుల్‌గా చేశాం.
– డాక్టర్ అమరేష్, కార్డియో థొరాసిక్ విభాగాధిపతి, నిమ్స్ హాస్పిటల్