సిటీబ్యూరో, మే 30 (నమస్తేతెలంగాణ) : సాయం చేయాలంటే పెద్ద మనస్సు ఉంటే చాలు ఏదోరకంగా సహాయం చేయవచ్చు. కరోనా ఆపత్కాలంలో ఓ మహిళా ఐటీ ఉద్యోగిని అభాగ్యులకు అండగా నిలుస్తున్నది. తన నెల జీతం మొత్తం కరోనా బాధితుల కోసం వెచ్చిస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్ కారణంగా అనేక కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. భర్తను కోల్పోయి భార్య, భార్య లేక భర్త, తల్లిదండ్రులను కోల్పోయి చిన్నారులు, పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలు.. ఇలా ఛిద్రమయ్యాయి. ఇలాంటి హృదయ విదారక ఘటనలు చూసి చలించిపోయిన ఐటీ ఉద్యోగిని దుర్గాకల్యాణి తనవంతు సాయంగా బాధితులకు రూ.1500 విలువజేసే సరుకుల కిట్‌ను అందిస్తున్నది. జగతి ఫౌండేషన్ పేరుతో ఈ వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆమె నెలకు సరిపడా సరుకులు పంపిణీ చేస్తున్నది. రోగనిరోధకశక్తి (ఇమ్యూనిటీ) పెంచే పోషకాహారం ఈ కిట్‌లో ఉండటం విశేషం. ఈ సాయం మరో రెండునెలలపాటు ప్రతి రోజు కొనసాగుతుంది.
ఒక్కో కిట్‌లో బియ్యం-5 కేజీలు, కందిపప్పు 2 కేజీలు, మినపప్పు 2 కేజీలు, శనగలు, పెసరపప్పు 2 కేజీలు, నట్స్, ఇడ్లీ రవ్వ 1 కేజీ, చింతపండు అరకిలో, చక్కెర 2 కేజీలు, మిలెట్ చిక్కి, రస్క్స్, సోప్స్, ఇతర కిరాణసామగ్రి, మాస్క్‌లు, శానిటైజర్లు తదితర ఉంటాయి. ఆర్గనైజేషన్ తరపున అనాథ పిల్లలకు డిజిటల్ లిటరసీ, డ్రాయింగ్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. మహిళా సాధికారత కోసం ఏర్పడిన ఈ సంస్థ ఇప్పుడు సర్వ్ విత్ హార్ట్ పేరుతో అభాగ్యులకు భరోసానిస్తున్నది.
కరోనా బారినపడి ఇబ్బందిపడుతున్న వారు సరుకుల కిట్ కోసం 9963741518 నంబర్‌ను సంప్రదించాలి. ఈ సేవా కార్యక్రమానికి సైక్లింగ్ కమ్యూనిటీ-రిలీఫ్ రైడర్స్ తోడయ్యారు. లొకేషన్ షేర్ చేయడం లేదా చిరునామా చెబితే సైక్లిస్టులు ఇంటివద్దకే వచ్చి అందజేస్తారు. ప్రతిరోజు 20 కుటుంబాలకు కిట్లు అందిస్తారు.
కొవిడ్ పరిస్థితులు చాలా భయానక వాతావరణాన్ని సృష్టించాయి. ఆత్మీయులను కోల్పోయి అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటప్పుడే వారిని ఆదుకోవాలి. సైక్లిస్టులు కిట్లను అందిస్తూ సాయానికి తోడ్పడుతున్నారు. వారికి కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే కొవిడ్ బాధితులకు కొంతైన ఉపశమనం లభిస్తుంది. దుర్గా కల్యాణి, ఫౌండర్, జగతి ఫౌండేషన్
లొకేషన్ చెబితే చాలు ఆ కిట్లను వారికి అందిస్తాం. ఇంత మంచి కార్యక్రమంలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది. ప్రతిరోజు సుమారు 50 మందికి నగరంలో మెడిసిన్, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం. జగతి ఫౌండేషన్ సాయాన్ని కూడా బాధితులకు చేరుస్తాం. రవి సాంబారి,
సైక్లిస్ట్, రిలీఫ్ రైడర్స్.