Sabitha IndraReddy | కోహెడ ఇంటెగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపన వేదికగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అజ్ఞానంతో, తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేసిన రాజకీయ విమర్శలే తప్ప మరోటి కాదు. ముఖ్యమంత్రి తీరు “ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే” అన్న చందంగా ఉందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కోహెడలో అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ నిర్మించాలని ప్రతిపాదించి, దాదాపు 300 ఎకరాల భూమిని సేకరించి, దానికి పక్కా రోడ్‌మ్యాప్ సిద్ధం చేసింది కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమే. నాడు గడ్డిఅన్నారం మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి (TIMS) నిర్మించి, రైతులకు ఇబ్బంది లేకుండా కోహెడకు తరలిస్తుంటే అడ్డుపడి, రాజకీయం చేసింది ఇదే కాంగ్రెస్ నాయకులు కాదా..?
బీఆర్ఎస్ వేసిన బలమైన పునాదులపై, మేము కేటాయించిన భూముల్లో నిలబడి ఈ రోజు రేవంత్ రెడ్డి కేవలం కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్లు కట్ చేస్తూ క్రెడిట్ అంతా తమదే అన్నట్లు మాట్లాడుకోవడం హాస్యాస్పదమని అన్నారు. పాత పథకానికే మళ్లీ రంగులు అద్ది, తామేదో కొత్తగా చేస్తున్నట్లు కాంగ్రెస్ డబ్బా కొట్టుకుంటోందని ఆరోపించారు.
‘అభివృద్ధి’ ముసుగులో పేద, మధ్యతరగతి రైతుల నోళ్లు కొట్టి..
గతంలో కోహెడలో ఇంటెగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన భూమిలో కాకుండా, మరో చోటికి తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఆ భూమిని ఎవరికి అప్పగించాలని అనుకుంటున్నారు..? అని ప్రశ్నించారు. ప్రస్తుతం మీరు మార్కెట్ నిర్మించాలని అనుకుంటున్న భూమిని సాగు చేసుకుంటున్న రైతులకు ముందుగా నష్టపరిహారం చెల్లించండి, ఆ తర్వాతే పనులు ప్రారంభించండి. అభివృద్ధిని మేము ఎన్నడూ అడ్డుకోలేదు రేవంత్ రెడ్డి.. రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ఆలోచనలు, ప్రణాళికలు కేసీఆర్ ప్రభుత్వంలోనే మొదలయ్యాయి. మేము రైతుల సమ్మతితో ప్రాజెక్టులు చేయాలనుకుంటే, మీరు ‘అభివృద్ధి’ ముసుగులో పేద, మధ్యతరగతి రైతుల నోళ్లు కొట్టి, కార్పొరేట్ శక్తుల కోసం, రియల్ ఎస్టేట్ మాఫియా కోసం వేల ఎకరాల సారవంతమైన భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఫైర్ అయ్యారు.
ఫార్మా సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రద్దు చేసి, పరిశ్రమలను వెనక్కి పంపించి, రాష్ట్ర ప్రగతిని వెనక్కి నెట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ఈ రోజు భూములు కోల్పోతున్న రైతులను పోలీసుల లాఠీలతో, నిర్బంధాలతో భయభ్రాంతులకు గురిచేస్తుంటే, బాధితుల పక్షాన నిలబడటం ప్రతిపక్షంగా మా బాధ్యత అని.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా సిటీని నిర్మిస్తామంటే కాలుష్య కారక పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించిన రేవంత్ రె ప్రస్తుతం అదే స్థలంలో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయబోమని స్పష్టంగా ప్రకటించగలరా..? చెప్పాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు నీరంది, భూగర్భ జలాలు పెరిగి, చెరువులు అడుగంటకుండా నిండడం వల్లే ఈరోజు తెలంగాణ దేశంలోనే అత్యధికంగా వరి పండించే స్థాయికి చేరింది. ప్రాజెక్టుల వల్ల చుక్క నీరు రాలేదనడం సీఎం అజ్ఞానానికి పరాకాష్ట. రైతుల కష్టాన్ని, గత ప్రభుత్వ విజయాన్ని తక్కువ చేసి చూపించడానికే ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 30 నెలల్లోనే రాష్ట్రంలో సాగునీరు, తాగునీటి ఎద్దడి ఎందుకు వచ్చింది? కరెంట్ లేక, సాగునీరు అందక ఎండిపోయిన పంటలను చూసి రైతులు ఎందుకు రోడ్లపైకి వచ్చి గుండెలు బాదుకుంటున్నారు..? పండిన పంటను కూడా కొనుగోలు చేయక రైతుల కష్టాన్ని రోజుల తరబడి కల్లాల పైనే ఉంచిన ఘన చరిత్ర మీది కాదా? మూడు కాళ్ల ముచ్చటగా కాళేశ్వరాన్ని ఎండబెట్టి, కేసీఆర్ నీటి మేనేజ్మెంట్ చేతకాక ప్రకృతిని, రైతుల కష్టాన్ని సాకుగా చూపిస్తున్నది మీ ప్రభుత్వ చేతగానితనం కాదా? అని అడిగారు.
ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడానికే..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించి, యుద్ధప్రాతిపదికన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు చేపడితే… మీరు గద్దెనెక్కిన ఈ రెండున్నర ఏళ్లుగా కాలయాపన చేసి, నేడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. మీ నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని, ‘కారు’ గుర్తును పాతాళానికి తొక్కేయడం ప్రజాస్వామ్యంలో ఎవరి తరం కాదు. ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది మీ తుగ్లక్ నిర్ణయాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడానికేనని స్పష్టం చేశారు.
ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక, రైతు భరోసా ఎగ్గొట్టి, రుణమాఫీ పేరుతో కాలయాపన చేస్తూ, నిరుద్యోగులను మోసం చేసి, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కోహెడ వేదికగా బీఆర్ఎస్ నాయకులపై సీఎం విషం గక్కారు. భవిష్యత్తులో ప్రజలు ఎవరిని పాతాళానికి తొక్కుతారో కాలమే సమాధానం చెబుతుందన్నారు.
Vadde Naveen | వడ్డే నవీన్ సినిమాలో నటించిన సుమ.. 26 ఏళ్ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసిన ఇంటర్వ్యూ
Chiranjeevi New Movie | మెగా 158 అప్డేట్: చిరంజీవి-బాబీ మూవీలో కన్నడ బ్యూటీ రచితా రామ్!