సిటీబ్యూరో, జనవరి 25 ( నమస్తే తెలంగాణ ) : కార్ల రిజస్ట్రేషన్లలో రంగారెడ్డి జిల్లా టాప్ గేర్లో దూసుకెళ్తున్నది. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక 2021-22 ప్రకారం 38,074 కార్లతో జిల్లా అగ్ర స్థానంలో నిలువగా తర్వాతి స్థానంలో మేడల్చ్ మల్కాజిగిరి , హైదరాబాద్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అలాగే వివిధ వాహనాల రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలోనే అత్యధికంగా వాహనాలు రిజిస్ట్రేషన్ అయిన జిల్లాగా హైదరాబాద్ స్థానం సంపాదించుకుంది. 2021-22లో 1.43లక్షల వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఈ వివరాలను తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక వెల్లడించింది. తర్వాత స్థానంలో మేడ్చల్-మల్కాజిగిరి నిలిచింది. 1.27లక్షల వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. రంగారెడ్డి 1.24లక్షల వాహనాలతో మూడో స్థానంలో ఉంది. స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక తెలంగాణలో గత ఏడాది రిజిస్ట్రేషన్ అయిన వాహనాల వివరాలను వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రం మొత్తంలో 8.79లక్షల వాహనాలు రిజిస్ట్రేషన్ అవగా.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 3,94,476 వాహనాలు రిజిస్ట్రేషన్ కావడం విశేషం. ఇందులో అధికంగా 3,49,500 నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అంతేకాదు గత ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ కూడా పెరిగింది. మూడు జిల్లాలు కలిపి 15,673 ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి.
రాష్ట్రంలో సెక్స్ రేషియో 988(ప్రతి 1000 మంది పురుషులకు మహిళల సంఖ్య)గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో రాష్ట్రంలోనే అతి తక్కువగా 950 మంది ఉండగా..అత్యల్పంగా ఉన్న జిల్లాలో వరుసగా హైదరాబాద్ 954 మంది, మేడ్చల్ జిల్లాలో 957గా స్త్రీ, పురుషుల నిష్పత్తి ఉంది. 0-6 వయసుగల బాల బాలికల సెక్స్ రేషియోను పరిశీలిస్తే..హైదరాబాద్ జిల్లాలో 914గా, మేడ్చల్ జిల్లాలో 934గా, రంగారెడ్డి జిల్లాలో 925గా బాలబాలికల నిష్పత్తి ఉంది.
0-6 వయస్సు గల చిన్నారులు రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 24,26,243 మంది చిన్నారులు ఉండగా..అందులో 0-6 వయస్సుగల చిన్నారులు అత్యధికంగా 2,97,841(12.3 శాతం)గా ఉంది. ఆ తర్వాత స్థానంలో హైదరాబాద్ నిలిచింది. హైదరాబాద్ జిల్లాలో ఉన్న మొత్తం 39,43,323 జనాభాలో 0-6 వయస్సు చిన్నారులు 4,69,126(11.9 శాతం), 24,60,095 జనాభా ఉన్న మేడ్చల్ జిల్లాలో 2,87,714 మంది చిన్నారులు ఉండి మూడో స్థానంలో నిలిచింది.