కొండాపూర్, ఆగస్టు 19 : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘శక్తి’ స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గంలోని ప్రభుత్వ లెదర్ టెక్నాలజీ కళాశాల వద్ద విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు. కళాశాల ఎదుట సుమారు 200 మంది విద్యార్థులు నిరసన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “శక్తి డౌన్.. డౌన్”, “జీవో-97 రద్దు చేయాలి”, “పాలిటెక్నిక్ విద్యను కాపాడాలి” అంటూ ఆందోళనకారులు పెద్దఎత్తున నినాదాలతో ప్రాంతాన్ని మార్మోగించారు. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (వైఐఎస్ యూ)లో విలీనం చేయడం వల్ల విద్యార్థుల మూడేళ్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో వేలాది మంది విద్యార్థుల ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.
‘శక్తి’ స్కీమ్ పేరుతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను క్రమంగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు సర్కారు కుట్ర చేస్తోందని విద్యార్థులు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సక్రమంగా అమలు చేయలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొత్త స్కీమ్‌ల పేరుతో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ‘శక్తి’ స్కీమ్‌ను, జీవో-97ను రద్దు చేసి పాలిటెక్నిక్ కళాశాలలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యను ప్రైవేటీకరించే ఎలాంటి నిర్ణయాన్నైనా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.
ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారని, పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని వారు ఆరోపించారు. అయితే పోలీసుల బెదిరింపులకు తాము భయపడేది లేదని, తమ హక్కుల కోసం ఎంతదూరమైనా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. “మా లక్ష్యం నెరవేరే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదు. ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తాం. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడే నిర్ణయాలను సహించబోము” అని ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు హెచ్చరించారు.
