బంజారాహిల్స్,డిసెంబర్ 11: జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు ప్రధాన రహదారుల్లో పెరిగిన ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రెండువారాల క్రితం చేపట్టిన ట్రాఫిక్ మళ్లింపుతో చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సాఫీగా సాగుతుండగా కొన్ని బాటిల్ నెక్ ప్రాంతాలో మాత్రం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని ట్రాఫిక్ అధికారులు గుర్తించారు. ఆయా సమస్యలకు కారణాలు కనుగొన్న ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొన్ని చర్యలకు శ్రీకారం చుట్టారు.
జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45లోని హార్ట్‌కప్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ కింద ఇరుకుగా ఉండడంతో అక్కడ ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతుందని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు.
జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 1సీవీఆర్ జంక్షన్ వైపునుంచి చెక్‌పోస్ట్‌కు వెళ్లాల్సిన వాహనాలు నేరుగా వెళ్లకుండా జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45మీదుగా వెళ్లి హార్ట్‌కప్ వద్ద యూ టర్న్ చేసుకోవాల్సి వస్తోంది. అయితే హార్ట్‌కప్ ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ కింద రోడ్డు విస్తీర్ణం పెంచాల్సి ఉందని జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులను ట్రాఫిక్ అధికారులు కోరారు. దీంతో ఈ చౌరస్తాలో ఉన్న సెంట్రల్ మీడియన్‌ను సుమారు 10 అడుగుల మేర విస్తీర్ణాన్ని తగ్గించారు.
సీవీఆర్ జంక్షన్ నుంచి వచ్చి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 హార్ట్‌కప్ వద్ద యూ టర్న్ తీసుకోవాలనుకునే భారీ వాహనాలు సాఫీగా వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది.
జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36 నుంచి రోడ్డు నంబర్ 39 వైపునకు వెళ్లే రోడ్లపై కూడా గుంతలు పడడంతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతున్నట్లు గుర్తించిన అధికారులు వాటిని పూడ్చాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరారు.