Hyderabad | విశాలమైన ఔటర్ రింగ్ రోడ్డు రహదారి.. దానికి ఇరువైపులా ఆకాశమే హద్దుగా వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాలు.. చుట్టూ పచ్చని చెట్లు.. జిగేల్మనే వెలుగులతో… చూస్తుంటే న్యూయార్క్ నగరాన్ని తలదన్నేలా నగరంలో హైరైజ్ భవనాలు వెలుస్తున్నాయి. ఒక దానికి మించి మరొకటి…పోటీ లేకుండా.. సాటి రాకుండా.. ఆకాశహర్మ్యాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. రియల్ రంగంలో రారాజుగా నిలుస్తున్న మహానగరానికి ఈ భవనాలు మకుటాలుగా నిలుస్తున్నాయి. 30 నుంచి 60 అంతస్తుల వరకు భారీ బహుళ అంతస్తుల భవనాలకు నగరం కేరాఫ్‌గా నిలుస్తున్నది. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం నార్సింగి కేంద్రంగా సరికొత్త హంగులతో ఇంటర్‌చేంజ్‌ను నిర్మించింది. మరోవైపు సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్‌ను ఏర్పాటు చేసి అదనపు శోభను తీసుకొచ్చింది. మరో 15 రోజుల్లో ఈ సైకిల్ ట్రాక్ అందుబాటులోకి రానున్నది. తాజాగా అటు ఐటీ కారిడార్… ఇటు శంషాబాద్ ఎయిర్‌పోర్టును కలుపుతూ నార్సింగి మీదుగా ఎయిర్‌పోర్టు మెట్రో పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇవన్నీ పూర్తయితే నార్సింగి మరో న్యూయార్క్ నగరంలా కావడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఓఆర్ఆర్ ఎక్కితే తలెత్తి.. చూడాల్సిందే. కనురెప్పలు ఆర్పకుండా అద్భుత ప్రపంచాన్ని ఆస్వాదించాల్సిందే. ఇన్నాళ్లు ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో వెలసిన ఇరవై, ముప్పై అంతస్తుల హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులను చూసి నగర వాసులు ఉబ్బితబ్బైపోయేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఏకంగా 58 నుంచి 60 అంతస్తుల్లో ఓఆర్ఆర్ చుట్టు పక్కల ఎటు చూసినా ఆకాశహర్మ్యాలే దర్శనమివ్వనున్నాయి. మరో రెండేండ్లు ఆగితే.. ఆకాశమే హద్దుగా వెలుస్తున్న నిర్మాణాలతో అవుటర్ పరిసరాలు డల్లాస్‌ను తలపించడం ఖాయమని నిపుణులు చెప్పుకుంటున్నారు.
సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ): ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ తర్వాత నార్సింగి చుట్టు పక్కల ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నట్లు అంచనావేసిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నార్సింగి వద్ద కొత్తగా ఇంటర్‌చేంజ్‌ను అభివృద్ధి చేసింది. ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. శంషాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు నానక్‌రాంగూడ టోల్ ప్లాజా దాకా వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం నార్సింగిలో ఓఆర్ఆర్ పైనుంచి వాహనాలు దిగేందుకు, పైకి ఎక్కేందుకు వీలుగా కొత్తగా ర్యాంపులను నిర్మించడంతో వాహనదారులకు ఊరట కలిగింది. తెలంగాణ పోలీస్ అకాడమీ దాటిన తర్వాత నార్సింగి ఇంటర్‌చేంజ్‌లో దిగిన వాహనాలు కోకాపేట, శంకర్పల్లి, నార్సింగి, మణికొండ, పుప్పాల్‌గూడ, గండిపేట, మంచిరేవుల వంటి ప్రాంతాలకు సులువుగా రాకపోకలు సాగిస్తున్నారు.
రెండేండ్లలో అంతా చేంజ్..
రెండేండ్ల కిందట ఓఆర్ఆర్ నార్సింగి మీదుగా నానక్‌రాంగూడ వైపు చూస్తే 32 అంతస్తులతో కూడిన హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుకు చెందిన 10 టవర్లు స్పష్టంగా కనిపించేవి. ఆ సమయంలో అవి ఓఆర్ఆర్ మీదుగా చూస్తే ఎంతో అద్భుతం అన్నట్లుగా ఉండేవి. ఇప్పుడు అక్కడ సీన్ మారిపోయింది. ప్రస్తుతం 32అంతస్తులతో కూడిన హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు పక్కనే 42 అంతస్తులతో హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును చేపట్టింది. దీంతో వీటిని చూస్తున్న నగర వాసులు అకాశం హద్దుగా ఉన్నాయంటూ అశ్చర్యంగా చూస్తున్నారు. ఇదంతా ఓఆర్ఆర్ లోపలి వైపు అయితే.. ఇక ఓఆర్ఆర్ ఆకాశమే హద్దుగా 58 నుంచి 60 అంతస్తులో హైరైజ్ ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ రానున్న రెండేండ్లలో ఫ్యూచర్ అంతా.. అవుటర్ అవతలే.. అని చెప్పక తప్పదు.
ఆగస్టు 15న సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ ప్రారంభం
నార్సింగి మీదుగా ప్రస్తుతం నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు ఎంతో ప్రతిష్టాత్మకమైన సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇవి చివరి దశకు చేరుకోగా.. ఆగస్టు 15న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవైపు సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ పనులతో పాటు మరోవైపు సర్వీసు రోడ్ల విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇలా నార్సింగి కేంద్రంగా ఇరువైపులా ఔటర్ రింగు రోడ్డు వైపు అభివృద్ధి పరుగులు పెడుతున్నది.
త్వరలో ప్రారంభం కానున్న ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణ పనులు
ఓ వైపు ఐటీ కారిడార్.. మరో వైపు శంషాబాద్ ఎయిర్‌పోర్టు.. మధ్యలో ప్రధాన వారధిగా ఉన్న ఔటర్ రింగు రోడ్డు నార్సింగి మీదుగా సరికొత్త మార్పులకు కేంద్రంగా మారింది. ఇక్కడి నుంచే ఎయిర్‌పోర్టు మైట్రో రైలు ప్రాజెక్టు పనులు సైతం త్వరలోనే మొదలు కానున్నాయి. దీంతో నార్సింగికి మరింత ఆధునిక శోభ సంతరించుకోనున్నది. నార్సింగి బ్రిడ్జి పక్కనే ఉన్న మూసీ నది, మూసీ నదికి మరోవైపు ఉన్న మంచిరేవులలో సైతం ఇప్పుడిప్పుడే భారీ బహుళ అంతస్థుల నిర్మాణాలు మొదలవుతున్నాయి.