ఎంఎంటీఎస్‌తో ప్రయాణం సులభతరం
ఎంఎంటీఎస్ రాకతో మేడ్చల్ ప్రజలకు రైల్వే ప్రయాణం సులభతరమైంది. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా మేడ్చల్-సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ ఏప్రిల్ 8న ప్రారంభించారు.
- డబ్బు, సమయం ఆదా
- మేడ్చల్ ప్రజలకు ప్రయోజనం
మేడ్చల్, మే 8 : ఎంఎంటీఎస్ రాకతో మేడ్చల్ ప్రజలకు రైల్వే ప్రయాణం సులభతరమైంది. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా మేడ్చల్-సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ ఏప్రిల్ 8న ప్రారంభించారు. అతి తక్కువ సమయం, చార్జీలతో నగరానికి చేరుకునే అవకాశం లభించడంతో స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్‌కు ఆర్టీసీ బస్సు సర్వీసులు బాగానే ఉన్నాయి. 10 నిమిషాలకు ఒక సర్వీసు అందుబాటులో ఉన్నా రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌తో సమయం చాలా తీసుకుంటుంది. ప్రధానంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. మేడ్చల్ మీదుగా వెళ్తున్న 44వ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. సికింద్రాబాద్ చేరుకోవాలంటే మేడ్చల్ చెక్‌పోస్టు, కొంపల్లి, దూలపల్లి, సుచిత్ర, బోయిన్పల్లి, పారడైస్ దాటుకొని వెళ్లాలంటే అడుగడుగునా ఉన్న సిగ్నల్స్‌తో సమయం చాలా తీసుకుంటుంది. పైగా ఆర్టీసీ బస్సు చార్జీ రూ.40 ఉండగా, ఎంఎంటీఎస్ రైల్లో రూ.10 మాత్రమే ఉంది. సమయం, డబ్బులు ఆదా అవుతుండటంతో ప్రజలు రైల్వే ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు.
ఉద్యోగులు, విద్యార్థులకు ప్రయోజనం
గతంలో మేడ్చల్ పట్టణంతో పాటు డబిల్పూర్, గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి, రాయిలాపూర్, గిర్మాపూర్, శ్రీరంగవరం తదితర గ్రామాల ప్రజలు ఎక్కువ రైలు సౌకర్యాన్ని వినియోగించుకునేవారు. అయితే రైల్వే సర్వీసులు తక్కువగా కావడంతో ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు ఎంఎంటీఎస్ రాకతో వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులకు ఎంతో సౌకర్యంగా మారింది. విద్యార్థులు, ఉద్యోగులు సికింద్రాబాద్‌కు చేరుకొని, నగరంలో ఏ మూలకైనా మెట్రో సర్వీసును వినియోగించుకొని అతి తొందరగా గమ్యస్థానాన్ని చేరుకునే అవకాశం ఏర్పడింది.
అనుకూలంగా ఉంది
ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులో రావడంతో అనుకూలంగా ఉంది. నగరం అభివృద్ధి చెందుతూ మేడ్చల్ వరకు విస్తరిస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఎంఎంటీఎస్ రావడంతో తొందరగా నగరానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు, విద్యార్థులకైతే బాగా ఉంది. సికింద్రాబాద్ నుంచి వేరే ప్రాంతాలకు మెట్రోను వినియోగించుకుని, గచ్చిబౌలి, కూకట్పల్లి, హైటెక్ సిటీ ఇతర ప్రాంతాలకు సులభంగా వెళ్లవచ్చు.
– మండల రవికుమార్, మేడ్చల్
వ్యాపారులకు ఉపయోగకరం
ఎంఎంటీఎస్ వ్యాపారులకు ఉపయోగకరంగా ఉంది. నగరానికి వెళ్లి, సరుకులకు తెచ్చుకోవాలంటే ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది ఉంటుంది. సమయానుకూలంగా ఎంఎంటీఎస్‌ను వినియోగించుకుంటే సులభంగా వెళ్లి రావొచ్చు. ఎంఎంటీఎస్, మెట్రోలను వినియోగించుకుంటే డబ్బు, సమయం ఆదా అవుతుంది.
– రవి, హోటల్ వ్యాపారి, మేడ్చల్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

