హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 11: ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం హనుమకొండలోని కూరపాటి హాస్పిటల్లో ఆత్మహత్యల నివారణపై ప్లకార్డులను ఆవిష్కరించారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ స్పోర్ట్స్అధ్యక్షులు, ప్రొఫెసర్ డాక్టర్ కూరపాటి రమేష్ మాట్లాడుతూ యువతలో పెరుగుతున్న ఒత్తిడి, నిరాశ, ఒంటరితనం వంటి సమస్యలను కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజం సకాలంలో గుర్తించి వారికి అండగా నిలవాలని సూచించారు.
ఆత్మహత్యలు ఏ సమస్యకూ పరిష్కారం కాదని, ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుందని, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారితో ప్రేమగా మాట్లాడటం, వారి సమస్యలను ఓపికగా వినడం, అవసరమైన సమయంలో కుటుంబ సభ్యులు, నిపుణుల సహాయం అందించడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చన్నారు. యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, నిరాశ వంటి సమస్యల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, బాధలో ఉన్న వారికి ధైర్యం చెప్పి జీవితంపై ఆశ కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ‘జీవితం ఎంతో విలువైనది ఆత్మహత్యలు వద్దు-జీవితం ముద్దు’ అనే సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కూరపాటి రాధిక, సెక్రటరీ శ్రీధర్ పాల్గొన్నారు.