పోలీస్ స్టేషన్ల నిర్వహణకుపైసల్లేవ్!
హైదరాబాద్‌లోని ఒక పోలీసు స్టేషన్‌కు వెళ్తే ఫిర్యాదుదారుడు ఒక కార్పొరేట్ ఆఫీసులోకి వచ్చిన ఫీలింగు.. ఆ తర్వాత అతనికి మంచినీళ్లు, టీ ఇచ్చి అతని వద్ద నుంచి ఫిర్యాదు తీసుకునేవారు. సమస్య తెలుసుకుని దానికి పరిష్కారం దిశగా పనిచేసేవారు.
- పీఎస్ నిర్వహణకు ట్యాంకర్లు కొనాల్సిందే
- తాగునీటికీ కొరతే.. కాఫీ, టీలకూ బయటవారి మీద ఆధారపడాలి
- 9 నెలలుగా మెయింటెనెన్స్ ఖర్చులు రావడం లేదు
- నేరస్తులను పట్టుకోవడానికి జేబు నుంచి పెట్టుకోవలసిందేనట
- కొన్ని చోట్ల నెలవారీ మామూళ్లు తప్పడం లేదంటున్న అధికారులు
- స్టేషన్ ఖర్చుల కోసం ఫిర్యాదుదారులు, నేతల నుంచి వసూళ్లు
సిటీబ్యూరో/బంజారాహిల్స్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని ఒక పోలీసు స్టేషన్‌కు వెళ్తే ఫిర్యాదుదారుడు ఒక కార్పొరేట్ ఆఫీసులోకి వచ్చిన ఫీలింగు.. ఆ తర్వాత అతనికి మంచినీళ్లు, టీ ఇచ్చి అతని వద్ద నుంచి ఫిర్యాదు తీసుకునేవారు. సమస్య తెలుసుకుని దానికి పరిష్కారం దిశగా పనిచేసేవారు. ఫిర్యాదుదారుడు పీఎస్‌కు రావాలంటేనే గతంలో భయపడేది.. ఆ భయం పోగొట్టడానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో గత ప్రభుత్వం పోలీసు శాఖలో సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. అందులో భాగంగా అత్యాధునిక వాహనాలు ఇచ్చి, స్టేషన్ల నిర్వహణకు అవసరమైన ఖర్చులకోసం ఎవరినీ యాచించకుండా నెలవారీ మెయింటెనెన్స్ ఇచ్చిన కేసీఆర్ పోలీసులకు సరికొత్త గౌరవం కల్పించారు. ఇదంతా గతం..
ఇప్పుడు పరిస్థితి మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఖజానా ఖాళీ అయింది. పోలీసుశాఖకు సర్కారు నిర్వహణ ఖర్చులు ఇవ్వకుండా చుక్కలు చూపెడుతోంది. వాహనాల రిపేర్లు మొదలు అన్ని అవసరాలకు సొంత డబ్బులను పెట్టుకోవాలని చెప్పకనే చెబుతోంది. ఇందులో భాగంగా గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి పోలీసు స్టేషన్ల మెయింటెనెన్స్ ఖర్చులకు ఇవ్వకపోవడంతో పోలీసులు మరోసారి ఉమ్మడి రాష్ట్రంలో వ్యవహరించినట్లుగానే ఫిర్యాదుదారుల నుంచి కానీ, ఇతరత్రా అవకాశాలను వినియోగించుకుని స్టేషన్లను నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రధానంగా నగరంలోని చాలా స్టేషన్లలో మంచినీళ్లు కూడా దొరకడం లేదనేది వాస్తవం.
హైదరాబాద్ నగరంలోని పోలీసు స్టేషన్లలో నిర్వహణ కింద స్టేషనరీ మొదలుకొని పలు రకాల ఖర్చులు ఉంటాయి. వీటి కోసం తమ జేబుల నుంచి డబ్బులు పెట్టే పరిస్థితి ప్రస్తుతం లేదు. గత ప్రభుత్వ హయాంలో పీఎస్‌ల నిర్వహణ కోసం నిధులు కేటాయించి కేటగిరీల వారీగా డబ్బులు నెలనెలా ఇచ్చేది. అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి ఈ సంవత్సరం జనవరిలో నిధులు విడుదల చేయగా.. గత తొమ్మిది నెలలుగా డబ్బులు రాకపోవడంతో బయట నుంచి తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చిన్న చిన్న ఫంక్షన్లు మొదలుకొని నేతల మీటింగుల వరకు ఎవరినీ వదలకుండా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు.
పోలీసు వాహనాలకు పెట్రోలు, డీజిల్ సైతం సరిపోకపోవడంతో వారు ఎక్కడెక్కడైతే పెట్రోలింగ్ చేయాలో అక్కడ తూతూ మంత్రంగా కొద్దిసేపు చేయడం, లేదా ఒక్కోరోజు అసలే చేయకపోవడం వంటివి జరగడంతో నగరంలో క్రైమ్ రేటు క్రమక్రమంగా పెరుగుతుంది. చోరీ కేసులకు రికవరీకి వెళ్లడం, స్టేషనరీకి సంబంధించిన సామాగ్రి, ఖైదీలకు భోజనాలు.. ఇలా స్టేషన్ ఖర్చులు మామూలుగా ఉండవు. ఇవన్నీ కావాలంటే కనీస నిధులు అవసరం. అవేవీ ఇవ్వకపోవడంతో స్టేషన్లలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. గణపతి నవరాత్రుల వంటి ప్రత్యేక సందర్భాల్లో అదనపు ఖర్చులకు అంతే లేదు. ఇవన్నీ మేనేజ్ చేయాలంటే సర్కారు నుంచి డబ్బులు రావాలి లేదా తమ దగ్గరకు వచ్చే ఫిర్యాదుదారులు, నేతల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లుగా వసూళ్లు చేయాలి. ప్రస్తుతం ఇదే జరుగుతున్నదని ముఖ్యనేత ఇంటికి దగ్గరలో ఉన్న ఒక పోలీసు స్టేషన్ అధికారి చెప్పారు.
మంచినీళ్లు కూడా దొరకడం లేదు
హైదరాబాద్ మహానగరంలో చాలా పోలీస్స్టేషన్లలో తాగడానికి మంచినీళ్లు కూడా దొరకడం లేదు. స్టేషన్ సిబ్బంది తమ నీళ్లు తామే తెచ్చుకుని తాగాల్సిన పరిస్థితి. ఎవరైనా ఉన్నతాధికారి స్టేషన్‌కు వస్తే వారికి టీ, బిస్కెట్ ఇవ్వాలంటే కూడా డబ్బులు లేక జేబునుంచి పెట్టుకోవలసిన పరిస్థితి వచ్చిందని పోలీసులు చెప్పారు. ఇదిలా ఉంటే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు ప్రస్తుత పరిస్థితుల్లో పోలీస్స్టేషన్లలో నీళ్లు కావాలంటే ట్యాంకర్ బుక్ చేసుకోవాలని, అది కూడా కమర్షియల్ ట్యాంకర్ తీసుకోవాలని మున్సిపల్ అధికారులు సూచించారు.
దీంతో ఒక్కో ట్యాంకరుకు రూ.1100 కట్టి ట్యాంకర్ బుక్ చేసుకోవలసిన దుస్థితి వచ్చిందని సిటీలో ఓ కీలకమైన పోలీస్‌స్టేషన్ అధికారి చెప్పారు. అంతకుముందు ఈ ట్యాంకర్లు ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడు ఎల్‌నినో పేరు చెప్పి ట్యాంకర్లు బుక్ చేసుకోమ్మంటున్నారు. గతంలో పోలీస్‌స్టేషన్‌లో మంచినీళ్ల కోసం వాటర్‌బాటిల్స్ తెచ్చి పెట్టేవారు. ఇప్పుడు డబ్బులు లేకపోవడంతో స్టేషన్‌కు వచ్చేవారికి నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఫిర్యాదుదారులు స్టేషన్లో ఉన్న ఎండలో వచ్చి దాహంతో మంచినీళ్లు కూడా లేవా సారు అని అడుగుతుంటే ఏమీ చెప్పలేకపోతున్నామని సిబ్బంది చెప్పారు. అంతేకాకుండా స్టేషన్‌కు ఎవరైనా ఆఫీసర్ కానీ, నేతలు కానీ వస్తే మంచినీళ్లు ఇవ్వకపోవడంతో వారు నీళ్లు కూడా ఇవ్వలేరా? అంటూ ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయని, వారే నీళ్ల బాటిల్స్ తెప్పించి అక్కడ పెట్టి వెళ్లినట్లు ఒక స్టేషన్ హౌస్ ఆఫీసరు చెప్పారు.
ఖర్చు తడిసి మోపెడు..
పోలీసు అమరవీరుల సంస్మరణోత్సవాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ లక్ష్యం మంచిదే.. సేవా దృక్పథంతో పోలీసులు చేసిన పనిని ఖచ్చితంగా అభినందించాలి. అయితే పోలీస్స్టేషన్ల వారీగా ఈ శిబిరాల నిర్వహణకు ఖర్చు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే నిర్వహణ ఖర్చులు లేవు.. కనీసం పై నుంచి ఒక్క రూపాయి కూడా రాదు. దీంతో స్థానికంగా తమ పలుకుబడిని ఉపయోగించి రక్తదాన శిబిరాలు పెట్టడానికి అవసరమైన ఏర్పాట్లను చేసినట్లు పోలీసు అధికారులు చెప్పారు. సంస్మరణోత్సవాల్లో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందని ఒక ఉన్నతస్థాయి అధికారి చెప్పారు. ముఖ్యంగా తాము సేవాకార్యక్రమాలు చేపట్టినా వాటికి దాతల ప్రోత్సాహం ఉందని, అదే విధంగా నగరంలోని ఏదైనా కార్యక్రమం చేపట్టాలన్నా దాతలే ముందుకు వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆ అధికారి చెప్పారు.
9 నెలలుగా పెండింగ్..
రాష్ట్ర ఏర్పాటుకు ముందు పోలీస్‌స్టేషన్ నిర్వహణకు ప్రభుత్వాలు ఎలాంటి డబ్బులు ఇచ్చేవి కావు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు వసూళ్లకు దిగేవారు. అయితే ఆ దుస్థితి నుంచి పోలీస్ వ్యవస్థను బయటపడేసేందుకు కేసీఆర్ సర్కారు రాష్ట్రంలోని ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు నెలవారీ మెయింటెనెన్స్ ఇవ్వడం ప్రారంభించింది. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో సహా రాష్ట్రంలోని పీఎస్‌లకు నెలవారీ ఖర్చులు క్రమం తప్పకుండా ఇచ్చారు. పదేళ్లకు ముందు పీఎస్‌కు ఒక్కరూపాయి రాకపోగా ఇంకా ఎదురు ఖర్చులు పడేవి.
అటువంటిది కేసీఆర్ వచ్చాక డబ్బులు వస్తుండడంతో పోలీసుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. దీంతో ఫిర్యాదుదారుల నుంచి డబ్బుల వసూళ్లు కూడా కొంత ఆగిపోయాయి. హైదరాబాద్ నగరంలోని ఒక్కో పోలీస్‌స్టేషన్‌కు రూ.75వేలు, జిల్లా కేంద్రాల్లో రూ.50వేలు, మండల కేంద్రాల్లోని ఒక్కో పీఎస్‌కు రూ.25వేలు కేటాయించేవారు. ఈ పద్ధతి తెలంగాణలో తప్ప మరే ఇతర రాష్ర్టాల్లోనూ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బైకులు, కార్లు చాలా నీట్‌గా ఉండేవి. ఇప్పుడు బైకు రిపేరైతే బాగు చేసేవారు కరువని, బైకులు, కార్లు తోసుకుపోవలసి వస్తున్నదని ఒక పోలీసు అధికారి చెప్పారు. రేవంత్ సర్కారులో పోలీస్స్టేషన్ల నిర్వహణకు కేటాయించే డబ్బులు గత 9నెలలుగా రావడం లేదని కొందరు అధికారులు చెప్పారు. తాము ప్రతిపాదనలు పంపిన ప్రతిసారీ అవి చెత్తబుట్టలో పడేయడమే తప్ప ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది చెప్పారు.
ఈ పెండింగ్ నిధులు కొన్ని రూ.కోట్లు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మీ పోలీస్స్టేషన్లకు డబ్బులు రావడం లేదా.. అని ఒక డీసీపీ స్థాయి అధికారిని అడిగితే కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందంటూ వ్యాఖ్యానించారు. తమకు కూడా బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన పోలీస్ స్టేషన్లు చూడ్డానికి ఇంద్రభవనాల్లా ఉన్నప్పటికీ వాటిని మెయింటెన్ చేయడం కష్టమవుతున్నదని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దీంతో పోలీసులు స్తానిక నేతలు, మధ్యవర్తుల ద్వారా మెయింటెనెన్స్ వెళ్లదీయాల్సిన పరిస్థితి వచ్చిందని అధికారులు చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

