చార్మినార్, సెప్టెంబర్ 17 ః నగర పోలీస్ వ్యవస్థలో వివిధ విభాగాల్లో విధులు కొనసాగిస్తున్న సిబ్బందికి అనువైన కేంద్రాన్ని నెలకొల్పి, విధుల్లో మరింత స్వేచ్చగా పని చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. నగర పోలీస్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసిన క్రష్ సెంటర్ను ఆయన బుధవారం ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పోలీస్ వ్యవస్థలో మహిళా సిబ్బంది సేవలు ఘననీయంగా పెరిగినట్లు ఆయన తెలిపారు. బందోబస్తుతోపాటు ఇతర విధుల్లో మహిళా సిబ్బంది పాల్గొంటున్న క్రమంలో వారి చిన్నారుల పట్ల ఆందోళనలకు గురయ్యేవారని, విధులకు హాజరయ్యే సమయంలో చిన్నారులను ఎవరికి అప్పగించాలనే సంశయం వారిని మానసికంగా ఇబ్బందులకు గురి చేసేదని చెప్పారు. అలాంటి వారి సమస్యలను గుర్తించి విధుల్లో మరింత నిమగ్నమయ్యే విధంగా సిబ్బందికి పోలీస్ వ్యవస్థలో మొట్టమొదటిసారిగా క్రష్ సెంటర్ను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఇందులో దాదాపు 150 నుండి 200 మంది చిన్నారుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. చిన్నారులకు అవసరమైన ఆట వస్తువులతోపాటు వైద్యం అత్యవసర సేవలు అందించేందుకు సైతం సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎక్కడ విధులు కొనసాగిస్తున్నా, తమను తాము నిరూపించుకునేందుకు మహిళా సిబ్బందికి ఈ సౌకర్యం మరింత మేలు చేయనుందని సీపీ తెలిపారు. నగర పోలీస్ వ్యవస్థలోని 90వేల సిబ్బంది ఈ క్రష్ సేవలు వినియోగించుకోవచ్చన్నారు. సీఏఆర్ నుండి 600 మంది సిబ్బందిని నగర పోలీస్ విభాగంలో వివిధ పోలీస్ స్టేషన్లకు కేటాయించి ఖాళీలను భర్తీ చేశామని తెలిపారు. ఇందులో 230 మంది మహిళా కానిస్టేబుళ్లు లా అండ్ ఆర్డర్తోపాటు ట్రాఫిక్ విభాగాల్లోనూ విధులు కొనసాగిస్తున్నారని తెలిపారు. విశాలమైన గదులతో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
క్రష్ సెంటర్ కేవలం చిన్నారుల కోసమే వినియోగించుకోవాలని, ఇతరాత్ర బందోబస్తుల విధులకు హాజరయ్యే బెటాలియన్లకు కెటాయిస్తామంటే ఉపేక్షించబోమని కార్ సిబ్బంది హెచ్చరించారు. 2023 ఏప్రిల్లో శంకుస్థాపన చేసిన ఈ నిర్మాణాన్ని రూ.5 కోట్లు వెచ్చించి పూర్తి చేశారని తెలిపారు. 34 ఏళ్ల సర్వీసులో సిబ్బందికి ఉపయుక్తమైన క్రష్ కేంద్రాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. నగర పోలీస్ విభాగంగా మహిళా శక్తిని చాటేందుకు వారికి తగిన ప్రాత్సాహాన్ని అందిస్తున్నామని, ఇప్పటి వరకు మౌంటెడ్ విభాగంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళకు అవకాశం కల్పించామన్నారు. గుర్రపు స్వారీలో సమస్యలు ఎదురవుతాయనే విషయాన్ని గుర్తించినా దైర్యంగా ముందుకు వచ్చి విజయవంతంగా ట్రైనింగ్ పూర్తిచేసుకున్న సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. వారి అడుగులు మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ విక్రంసింగ్మాన్, జాయింట్ సీపీ జోయల్ డేవిస్, సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్, ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి, సౌత్ వెస్ట్ బీసీపీ చంద్రమోహన్, టాస్క్ఫోర్స్ డీసీపీ సుధీంద్ర, అడిషన్ డీసీపీ భాస్కర్, కిష్టయ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు.