వెంగళరావునగర్, అక్టోబర్ 8 : గత నెల అమీర్‌పేట డీకే రోడ్డులోని గోకుల్ ప్రైడ్ హోటల్లో జరిగిన మహిళ హత్య కేసును ఎస్ఆర్నగర్ పోలీసులు ఛేదించారు. మహిళను రాడ్డుతో తీవ్రంగా కొట్టి ఆమె మృతి చెందడంతో పరారైన ఆమె ప్రియుడు ఆవుసపల్లి శ్రీనివాస్ (38)ను నగరంలోని సీబీఎస్ వద్ద పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కథనం ప్రకారం… వికారాబాద్ జిల్లా థారూర్ మండలం, నాగసముద్రం గ్రామానికి చెందిన బి. శిరీష (34) ఎస్బీఐ కస్టమర్ సర్వీస్పాయింట్ను నిర్వహిస్తుండేది. ఆమెతో వికారాబాద్ జిల్లా తాండూరు సమీపంలోని పెద్దేముల ఓగులాపూర్‌కు చెందిన శ్రీనివాస్ పరిచయం పెంచుకున్నాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి పలుమార్లు శిరీష వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు కూడా తీసుకున్నాడు. ఈ క్రమంలో శిరీషను గత నెల గోకుల్ ప్రైడ్ హోటల్‌కు తీసుకొని వచ్చి 103 గదిలో బస చేశాడు. అయితే హోటల్ బుక్ చేసే సమయంలో తప్పుడు గుర్తింపు కార్డులను హోటల్ సిబ్బందికి అందజేశాడు. గదిలో ఉన్న సమయంలో తనను పెండ్లి చేసుకోవాలని శిరీష ఒత్తిడి చేయడంతో గదిలోని కర్టెన్ రాడ్డుతో ఆమెను విచక్షణా రహితంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం శిరీషకు సంబంధించిన రూ.4లక్షల నగదు, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకొని బయట నుంచి తాళం వేసి పరారయ్యాడు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలించారు. గురువారం ఉదయం అఫ్జల్ గంజ్ సీబీఎస్ వద్ద శ్రీనివాస్‌ను పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.1.30లక్షల నగదు, 7.996 గ్రాముల బంగారు గోలుసు, ఒక గ్రాము ఉంగరం, ఆమెకు చెందిన మోబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు ఆవుసపల్లి శ్రీనివాస్ ప్రేమ పేరిట మహిళలను మభ్యపెట్టి వారితో శారీరకంగా కలిసి, ఆపై డబ్బు తీసుకొని పరారయ్యేవాడని పోలీసులు విచారణ వెల్లడైంది. మహిళలను వేధించినట్టుగా వివిధ పోలీసు స్టేషన్లలో ఆరు కేసులు నమోదయ్యాయి. మొయినాబాద్‌లో రెండు, బోరబండలో ఒకటి, ఇతర ప్రాంతాల్లో మరో మూఐడు కేసులున్నట్లు గుర్తించారు. ప్రేమ పేరిట మహిళలను మోసం చేసి, వారి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని జల్సాలు చేయడం శ్రీనివాస్‌కు అలావాటు. అయితే శిరీష పెండ్లి చేసుకోమని పట్టుబట్టినందుకే ఆమెను అంతమొందించాడు. కర్టెన్ రాడ్డుతో శిరీష ఒంటిపై విచక్షణా రహితంగా కొట్టడంతో వాతాలు తేలాయి. దెబ్బలకు తాళలేకే ఆమె మృతిచెందినట్లు గుర్తించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.