సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ సర్వేక్షణ్-22లో భాగంగా మెరుగైన ర్యాంకే లక్ష్యంగా జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద పబ్లిక్ నోటీసు ద్వారా 75 మైక్రాన్ల కంటే తకువ ఉన్న ప్లాస్టిక్ నిషేధానికి స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం 6వ స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో 12 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారని.. గత స్టాండింగ్ సమావేశాల్లో మొత్తం 116 అంశాలు చర్చించి తీర్మానం చేసినట్లు మేయర్ తెలిపారు. ఆమోదించిన 116 అంశాల్లో రోడ్డు వెడల్పు కోసం స్థల సేకరణ, వైకుంఠధామాలు, రోడ్డు పనులు, చెరువుల పటిష్టతకు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణాలకు సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉన్నాయని వివరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, మహ్మద్ అబ్దుల్ సలామ్ షాహిద్, మిర్జా ముస్తఫా బేగ్, ప్రవీణ్ సుల్తానా, మందగిరి స్వామి, బతా జబీన్, మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, సీఎన్‌రెడ్డి, రావుల శేషగిరి, ప్రేమ్ కుమార్, సామల హేమ, కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్, అడిషనల్ కమిషనర్లు పౌసుమి బసు, సంతోష్, ఏసీ ఫైనాన్స్ అడిషనల్ కమిషనర్ కెనడి, ఈఎన్సీ జియా ఉద్దీన్, సీసీపీ దేవేందర్ రెడ్డి, అడిషనల్ సీపీ శ్రీనివాస్, హౌసింగ్ ఓఎస్డీ సురేశ్, అకౌంట్ చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, కార్యదర్శి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆమోదించిన అంశాలు..
కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ (సీఎస్ఆర్) కింద సరిల్ -24లో కూకట్పల్లి మండలం మూసాపేట్ విలేజ్ ముండ్ల కత్వా చెరువు అభివృద్ధి, పరిరక్షణ కోసం శేరిలింగంపల్లి మండలం మియాపూర్ గ్రామం గురునాథ్ చెరువు పనులను యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్‌కు ఇచ్చేందుకు ఎంఓయూ..
శేరిలింగంపల్లి వార్డు నంబర్ 105 గచ్చిబౌలి ఖాజాగూడలో రూ. 3 కోట్ల అంచనా వ్యయంతో
శ్మశాన వాటిక చేపట్టేందుకు పరిపాలన అనుమతి..
అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న సీ ప్రసాద్‌కు సంవత్సరానికి రెండు లక్షల 16 వేల రూపాయలు మంజూరు..
రహమత్ నగర్ పీజేఆర్ విగ్రహం ప్రతిపాదిత 24 మీటర్స్ వైడ్ జంక్షన్ ఇంఫ్రూవ్మెంట్కు కావాల్సిన రోడ్డు
విస్తరణ కోసం 54 ఆస్తుల సేకరణకు ఆమోదం..
చాంద్రాయణగుట్ట కేశవగిరి జంక్షన్ నుంచి ఆరాంఘర్ జంక్షన్ వయా బండ్లగూడ జంక్షన్ రైజింగ్ సన్ సూల్ బండ్లగూడ వరకు రోడ్డు వెడల్పునకు 368 ఆస్తుల సేకరణకు..
హాఫీజ్ బాబానగర్ మెయిన్ రోడ్ నుంచి బాలాపూర్ రోడ్ వయా జలమండలి డీఆర్డీఓ కాంపౌండ్ వాల్ వరకు రోడ్డు వెడల్పు కోసం 394 ఆస్తుల సేకరణకు..
ట్రేడ్ లైసెన్స్ కింద షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ట్రేడ్ లైసెన్స్, రెన్యువల్ తెలంగాణ హరిత నిధి కింద రూ.1000లు అదనంగా వసూలు..
లంగర్‌హౌస్ చెరువుకు సివరేజీ మళ్లింపునకు రూ.493.50 లక్షల మంజూరు..