ఎల్బీనగర్/చంపాపేట, సెప్టెంబర్ 8: భక్తులు గణేశ్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాలు అనుక్షణం తమ నిఘా నీడలోనే ఉంటాయని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ అన్నారు. శుక్రవారం (నేడు)గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి ఎల్బీనగర్ జోన్ సిబ్బందితో కర్మన్‌ఘాట్‌లోని కొత్తకాపు యాదవరెడ్డి గార్డెన్లో గురువారం నిర్వహించిన సమావేశంలో సీపీ పాల్గొని మాట్లాడారు. ఎల్బీనగర్ జోన్ పరిధిలోని సరూర్‌నగర్ చెరువుతో పాటు మన్సూరాబాద్, ఇంజాపూర్ ఇనాంగూడ, జల్పల్లి, శేరిగూడల చెరువులతో పాటు జీహెచ్ఎంసి ఏర్పా టు చేసిన బేబి పాండ్ల వద్ద తమ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు.
కరోనా కారణంగా గత రెండేళ్లుగా గణేశ్ మండపాల ఏర్పాటు తగ్గిందని, ఈ ఏడాది యథావిధిగా పెరిగిందన్నారు. నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చేపట్టాల్సిన ముందస్తు చర్యలు పటిష్టంగా చేపట్టనున్నట్లు సీపీ వివరించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి సిబ్బందితో పాటు ఇతర జిల్లాల నుం చి కూడా పోలీస్ సిబ్బందిని మోహరించినట్లు తెలియజేశారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని, గొడవలకు పాల్పడాలని చూసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాహనాలను తరలించే ముందు వాటి ఫిట్నెస్ను స్థానిక పోలీస్ స్టేషన్ల సిబ్బంది పరిక్షించాలని సూచనలు చేశారు. రోడ్లపై వాహనాలు నిలపకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మత ఘర్షణలకు తావులేకుండా తమ కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాలు అనుక్షణం తమ నిఘా నీడలోనే ఉంటాయని ఇందుకు భక్తులందరూ సహకరించాలని సీపీ మహేశ్ భగవత్ కోరారు.
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగే సామూహిక వినాయక నిమజ్జనోత్సవాలకు సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇప్పటికే సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌లో సుమారుగా 800 వినాయక విగ్రహాలు నిమజ్జనం కాగా సామూహిక నిమజ్జనం కార్యక్రమం రోజు మరో వెయ్యికిపైగా గణనాథులు నిమజ్జనం అయ్యేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వినాయక నిమజ్జనోత్సవాలకు మొత్తం 8 క్రేన్లను అందుబాటులో ఉన్నాయి.
మినీ ట్యాంక్‌బండ్‌పై లైటింగ్ ఏర్పాట్లు కూడా భారీగా చేపట్టా రు. మోబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయడంతో పాటుగా బ్యారీకేడ్లు ఏర్పాటు చేశారు. నిమజ్జనోత్సవంపై ఎంట్రీ పాయింట్‌తో పాటుగా ఎగ్జిట్ పాయింట్ వరకు సుమారు 70 సీసీ కెమెరాలు, జీహెచ్ఎంసీ, జలమండ లి, హెల్త్ విభాగం వారు కూడా తమ శిబిరాలను ఏర్పాటు చేశా రు. సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌పై రాచకొండ సీపీ మహేష్ భగవత్ పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
సుమారు 600 మంది పోలీసుల పహారాలో వినాయక సామూహిక నిమజ్జనోత్సవాలు జరుగనున్నాయి. మినీ ట్యాంక్‌బండ్ వద్ద పది మంది గజ ఈతగాళ్లను, రెండు బోట్లను అందుబాటులో ఉంచుతున్నారు. 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటున్నారు. పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి బండ్‌పై నిమజ్జన ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నారు. సరూర్‌నగర్ చెరువులో మొసలి ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు ఈ విషయం భక్తులకు తెలిసే విధంగా హెచ్చరిక బోర్డులు కూడా పెట్టారు.