Miyapur | అసలేం జరుగుతోంది? మియాపూర్ భూముల వెనుక సూత్రధారి ఎవరు?
ఒకటి కాదు, రెండు కాదు ఒకే చోట వందలాది ఎకరాలు.. అందులోనూ అవి ప్రభుత్వ భూములు. కొన్నేళ్లుగా సుప్రీం కోర్టులో వివాదం..ఆ భూములపై స్టేటస్కో అమలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు..
- ఉసిగొల్పారా.. స్వతహాగా వచ్చారా?
- ప్లాన్ ప్రకారమే చేశారా.. అనుమానిస్తున్న పోలీసులు
- సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు..
- బలం చేకూరుస్తున్న హెచ్ఎండీఏ జాప్యం
- రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన హెచ్ఎండీఏ భూముల కబ్జా వ్యవహారం
Miyapur | సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఒకటి కాదు, రెండు కాదు ఒకే చోట వందలాది ఎకరాలు.. అందులోనూ అవి ప్రభుత్వ భూములు. కొన్నేళ్లుగా సుప్రీం కోర్టులో వివాదం..ఆ భూములపై స్టేటస్కో అమలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు.. అయినా వీటన్నింటిని లెక్క చేయకుండా మియాపూర్ భూములను కబ్జా చేసేందుకు పేదలను ముందుగా ఉసిగొల్పారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే ఒకేసారి వేలాది మంది ఆ భూముల్లోకి రావడం, రెండు, మూడు రోజుల పాటు అక్కడే ఉండి గుడిసెలు వేసి కబ్జా చేసేందుకు చేసిన ప్రయత్నాల వెనక బలమైన పెద్దలే ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.
ఇప్పటికే మూడు రోజులుగా జరిగిన రచ్చతో సుమారు 50 మందిపై కేసు నమోదు చేయగా, వారిలో 21 మందిని మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా మియాపూర్ భూములు హెచ్ఎండీఏవే అయినా.. పోలీసుల విధులకు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో అలాగే వదిలేస్తే పరిస్థితి చేజారిపోతుందని, మియాపూర్లోనే ఈ నెల 29వరకు 144 సెక్షన్ పెట్టి ఆ భూముల్లోంచి ప్రజలను పంపించాలని సైబరాబాద్ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం పై సోషల్ మీడియాలో మియాపూర్ భూముల కబ్జా యత్నాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వంలోని పెద్దలే దీని వెనుక ఉన్నారన్న బలమైన ఆరోపణలు ఉన్నాయి.
పథకం ప్రకారమేనా..
ఒకే చోట పెద్ద మొత్తంలో ఉన్న ప్రభుత్వ భూముల్లోకి పేదలను పంపించడం ద్వారా ఆ భూములను కబ్జా చేయాలన్న పథకాన్ని అమలు చేసేందుకు కొందరు పెద్దలు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు అనుమానిస్తున్నారు. 2003లోనే అప్పటి ఉమ్మడి ఏపీలోనే ఈ భూములను హుడా(హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)కి అప్పగించింది. ఆ తర్వాత హుడా హెచ్ఎండీఏగా మారడంతో ఆ భూముల పర్యవేక్షణను హెచ్ఎండీఏ ఎస్టేట్ విభాగం, ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ భూములను కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నం చేస్తే అప్పటి ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించింది. ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ప్రమేయం ఉన్న వారిని అరెస్టు చేశారు.
తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ మియాపూర్ భూములను ఎలాగైనా కబ్జా చేయాలన్న ఆలోచనతో ఓ పథకం ప్రకారం మహిళలను ఆ భూముల్లోకి ప్రవేశించి గుడిసెలు వేసుకునేలా ఉసిగొల్పినట్లు తెలుస్తోంది. అయితే ఏకంగా రెండు, మూడు రోజుల్లో 4వేల నుంచి 5 వేల మంది పేద ప్రజలు ఆ భూముల్లోకి వచ్చి స్థలాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అడ్డుకున్న పోలీసుల పై రాళ్లతో దాడి చేయడంతో పరుగులు పెట్టే పరిస్థితికి దారితీసింది. ఇలా వేలాది మంది మియాపూర్‌లోని హెచ్ఎండీఏ భూముల్లోకి రావడానికి తెర వెనక భారీ కుట్ర దాగి ఉందన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మొత్తం భూముల విలువ రూ.20వేల కోట్ల దాకా ఉంటుందని, ప్రజలను అడ్డుకొని తమ సొంతం చేసుకోవచ్చనే పథకమే ఇదని కొందరు భావిస్తున్నారు.
సాధారణ ప్రజలు ఇట్ల జేస్తరా…!
సాధారణ ప్రజలు ఇంత ధైర్యం చేస్తారా? దీని వెనక పెద్ద గూడుపుఠాణీ దాగి ఉందని కొందరు అనుమానిస్తున్నారు. గత పదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం మియాపూర్ భూములను కాపాడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోందా?అనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఏవిధమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. దీని వెనక వేల కోట్ల కుంభకోణమే దాగి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మియాపూర్ భూముల పై సమగ్ర విచారణ చేసి, కబ్జాల వెనుక ఉన్న వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.
బలాన్ని చేకూరుస్తున్న హెచ్ఎండీఏ జాప్యం
ఉమ్మడి ఏపీలోనే ప్రభుత్వం వేలాది ఎకరాలను హెచ్ఎండీఏకు అప్పగించింది. అప్పటి నుంచి హెచ్ఎండీఏ ఆధీనంలోనే సుమారు 8500 ఎకరాల భూములున్నాయి. అందులో కీలకంగా జవహర్‌నగర్‌లో 3వేల ఎకరాలు, మియాపూర్‌లో 550 ఎకరాలు, శంషాబాద్, రాజేంద్రనగర్, బుద్వేల్ 200 ఎకరాల భూమి ఉంది. అయితే ఈ భూములన్నింటినీ కాపాడాల్సింది హెచ్ఎండీఏనే. ఇందుకోసం హెచ్ఎండీఏలో డిప్యూటీ కలెక్టర్ ర్యాంకు కలిగిన అధికారి ఎస్టేట్ ఆఫీసర్‌గా ఉండగా, డీఎస్పీ స్థాయి అధికారి పోలీసు శాఖ నుంచి ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం అధికారిగా ఉన్నారు.
వీరి కింద ఆయా భూములను ప్రతి రోజూ పర్యవేక్షించేందుకు ఏడుగురు సైట్ ఆఫీసర్లు, వీరికి మద్దతుగా సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మియాపూర్ భూముల రక్షణలో హెచ్ఎండీఏ సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే వేలాది మంది అక్కడికి వచ్చేందుకు దారి తీసిందనే ఆరోపణలున్నాయి. నెల రోజుల నుంచే మియాపూర్ భూముల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేసినా సమర్థవంతంగా అడ్డుకోకపోవడంతోనే ఈ ఘటన జరిగిందనే విమర్శలున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన వారే కొందరికీ సహకరిస్తుండటం వల్లే ఇలా జరుగుతోందని, పరిస్థితి తీవ్ర రూపం దాల్చే దాకా వెళ్లిందని పలువురు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

