Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో నిత్యం ఎక్కడో ఒక చోట హిట్ అండ్ రన్ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా గురువారం తెల్లవారుజామున బొల్లారం పరిధిలో వేగంగా కారు నడుపుతూ వచ్చిన ఓ డాక్టర్.. ఫుట్పాత్ వెంట ఉన్న తోపుడుబండ్లపైకి దూసుకెళ్లాడు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న పలువురు వ్యక్తులు వెంటాడి కారును అడ్డగించారు. అనంతరం ప్రమాదానికి కారణమైన డాక్టర్ను పట్టుకున్నారు. ప్రమాదానికి కారణమైన డాక్టర్.. హైదరాబాద్ నగరంలోని ఓ ఆస్పత్రిలో న్యూరో సర్జన్ అని తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో సయ్యద్ పాషా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అయితే తాను పని చేస్తున్న ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తానని చెప్పి, బాధితుడిని తన కారులో తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అత్తాపూర్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో పాషాను చేర్పించి, అక్కడ్నుంచి డాక్టర్ పారిపోయారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని, బిల్లులు కట్టలేక ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు వాపోయారు.