సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : ఇంధనం సమృద్ధిగా ఉన్నప్పుడు మైలేజీ, ఇంజిన్ స్మూత్‌గా నడిచేందుకు ఉపయోగపడే ఇంధన రకాన్ని వాహనదారులు ఎంచుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఓవైపు ఇంధన కొరత నగరాన్ని అతలాకుతలం చేస్తుంది. వాహనదారులు కిలో మీటర్ల మేర క్యూ కట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఇంధనం కోసం గంటల తరబడి బంక్‌ల ముందర వేచి చూడాల్సివస్తోంది. అత్యధిక బంక్‌లు మూసి ఉంటున్నాయి.
ఆయిల్ ట్యాంకర్ల కోసం బంక్‌ల యజమాన్యాలు సైతం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. మరోవైపు కొన్ని బంక్‌లు బ్లాక్ దందాకు తెరలేపాయి. ఇలాంటి పరిస్థితుల్లో నచ్చిన పెట్రోల్ రకం కాకుండా ఉన్న పెట్రోల్‌ను కొట్టించుకోవాల్సిన పరిస్థితి ఉంది. బంకుల్లో సాధారణంగా లభించే పెట్రోల్ కాకుండా సంబంధిత కంపెనీలు హై క్వాలిటీ పెట్రోల్‌ను అందుబాటులో ఉంచేవి. వాటికోసం ప్రత్యేకంగా బోర్డులు పెట్టి ఫిల్ చేసేవాళ్లు.
బంక్‌లో సాధారణ పెట్రోల్ అంటే మోటార్ స్పిరిట్ బీ 6-ఈ 12 లీటర్‌కు 110.66పై ధర ఉండగా, హై క్వాలిటీ పెట్రోల్ మోటార్ స్పిరిట్ ఎక్స్పీ-95 పెట్రోల్‌కు లీటర్ ధర రూ.116.88 ఉండేది. ఇందులో మరో రకమైన పెట్రోల్ కూడా అందుబాటులో ఉంది. అది ఎక్స్పీ-100. దీని లీటర్ ధర రూ.160కి పైగా ఉంది. ఇలానే సంబంధిత బంకుల్లో పవర్ పెట్రోల్, హై స్పీడ్ పెట్రోల్, క్లబ్ పెట్రోల్ తదితర రకాలు అందుబాటులో ఉండేవి. అత్యధిక ధర ఉన్న పెట్రోల్‌తో వాహనం సాఫీగా సాగిపోవడంతో పాటు మైలేజీ కూడా అధికంగా వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.
పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంజిన్‌లో ఎటువంటి సమస్య ఉన్నా.. వాహనం పరుగులు తీస్తుంది. ఉదాహరణకు సాధారణ పెట్రోల్ లీటర్‌కు 60 కిలో మీటర్లు ఇస్తే.. ఈ పెట్రోల్ లీటర్‌కు 64 కిలో మీటర్లు ఇస్తుందని వాహనదారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు చాలా బంక్‌ల్లో సాధారణ పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతర పెట్రోల్ రకాలు అందుబాటులో ఉండకపోవడంతో వాహనదారులు అవి లభించే బంక్‌లను అన్వేషించాల్సి వస్తోంది.
చివరికి నార్మల్ పెట్రోల్ దొరకడమే గగనంగా మారడంతో ఆ పెట్రోల్‌నే ఫిల్ చేయించుకుంటున్నారు. డీజిల్ విషయంలోనూ అంతే. సాధారణ డీజిల్ అంటే హై స్పీడ్ డీజిల్-బీఎస్6, ఎక్స్ట్రా గ్రీన్(ఎక్స్‌జీ-బీఎస్6)తదితర రకాలు ఉన్నాయి. ఈ డీజిల్‌తో తక్కువ శబ్ధం, బెటర్ కంబస్టియన్, ఉద్గారాలు తగ్గింపు, మైలేజీ అధికంగా రావడం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఇలా సంబంధిత పెట్రోల్ బంకుల్లో డీజిల్ రకాలు చాలా బంక్‌లో కొరత వెధిస్తోంది.