Hyderabad | హైదరాబాద్ : సోషల్ మీడియాలో పరిచయమైన ఓ బాలికను ప్రేమ పేరుతో మభ్యపెట్టి ఆమెకు దగ్గరయ్యాడు ఓ యువకుడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. అమీర్‌పేట్‌కు చెందిన నవీన్ కుమార్(19) బైక్ మెకానిక్ చేస్తూ జీవనం గడుపుతున్నాడు. అతనికి సోషల్ మీడియాలో పటాన్‌చెరుకు చెందిన 16 ఏండ్ల బాలిక పరిచయమైంది. దీంతో ఆమెను ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టాడు. కొన్ని నెలల తర్వాత నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.
అయితే బాలికకు ఇటీవలే ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో బాలికను గాంధీ హాస్పిటల్‌కు తరలించగా, ఆమె గర్భిణి అని తేలింది. దీంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. బాలికతో పాటు ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నవీన్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. బాలికకు చికిత్స కొనసాగుతోంది.